Southwest Monsoon: ఎండలు దంచి కొడుతున్నాయి. బయటికి వచ్చేందుకు వీలు లేకుండా చేస్తున్నాయి. ఫ్యాన్ పొద్దంతా తిరిగినప్పటికీ ఉక్క పూత తగ్గడం లేదు. కూలర్ కింద ఉన్నప్పటికీ చల్లదనం అనిపించడం లేదు. ఏసీ నిరంతరం తిరిగినప్పటికీ ఒంట్లో వేడి తగ్గడం లేదు. మొత్తానికి మృగశిర కార్తెలోనూ మాడు పగిలేలా ఎండ దంచి కొడుతోంది. 2019 సంవత్సరం మినహాయిస్తే గత పది సంవత్సరాలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఎప్పుడూ నమోదు కాలేదు. ఒకానొక దశలో వానాకాలం రెండో ఎండకాలంగా మారిందా అనిపిస్తోంది.
ఆలస్యం
పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిఫర్ జోయ్ తుఫాన్.. మొన్నటిదాకా రుతుపవనాల విస్తరణకు అడ్డంకిగా మారాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కై మెట్, భారత ప్రభుత్వ వాతావరణ శాఖ వెల్లడించాయి. బిఫర్ జోయ్ తుఫాన్ వల్ల గుజరాత్ రాష్ట్రంలో కనివిని ఎరగని స్థాయిలో వర్షాలు కురిసాయి. చెన్నైలోని తీర ప్రాంతంలో కూడా వర్షాలు నమోదు అయ్యాయి. అక్కడ వర్షాలు కురుస్తుండడంతో మన దగ్గర ఎప్పుడు పడతాయోనని ఇక్కడి రైతులు ఆశగా ఎదురు చూశారు. వర్షాలు కురవక పోగా ఎండలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో ఇక ఈ ఏడాది కరువు ఛాయలు ఏర్పడతాయని వాతావరణ శాఖ వర్గాలు వివరించాయి. వర్షాలు లేకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటల విస్తీర్ణం దాదాపు తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు పొడి దుక్కిలోనే పత్తి విత్తనాలు విత్తారు. వర్షం రాకపోదా అని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది.
రాగల మూడు రోజుల్లో..
జూన్ మాసం ముగిసే దశ చేరుకుంటున్నప్పటికీ తొలకరిజల్లులు మాత్రం కురవడం లేదు. దీంతో వేడి పెరిగిపోయి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలోనే వాతావరణ శాఖ ఒక మంచి వార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో నిలిచిపోయిన నైరుతి రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించింది. వీటి ప్రభావం వల్ల తెలంగాణ ప్రాంతంలో వచ్చే మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం కొంతమేర అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. దీనివల్ల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించింది. మరోవైపు ఇంతవరకు తొలకరి జల్లు సరిగా కురువకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు పెద్దగా పంటల సాగు చేపట్టలేదు. వర్షాలు సరిగా కురువకపోవడంతో ఈ ఏడాది వ్యవసాయ సీజన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.