Smita Sabharwal vs Revanth govt: స్మితా సబర్వాల్.. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిగా కొనసాగారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా.. మిషన్ భగీరథ కార్యకలాపాలు సాగించే అధికారిగా ఆమె విధులు నిర్వర్తించారు. అంతేకాదు తెలంగాణ సాగునీటి పారుదల రంగంలో కూడా ముఖ్యపాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా ఉన్న ఆమె పేరు అప్పట్లో తెలంగాణ రాజకీయాలలో పరోక్షంగా వినిపించేది. అప్పటి విపక్షాలు కూడా ఆమెపై ఆరోపణలు చేసేవి. అందులో రేవంత్ కూడా ఉన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానంగా దృష్టి సారించింది స్మితా సబర్వాల్ పైనే.
అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. పాటించిన విధానాలు.. వివిధ శాఖలకు సంబంధించిన వ్యవహారాలపై రేవంత్ శ్వేత పత్రాలు విడుదల చేశారు. అప్పట్లో స్మిత పర్యవేక్షించిన శాఖలకు సంబంధించిన వివరాలు ఇవ్వమంటే ఆమె నిరాకరించారు. ఇదే విషయాన్ని రేవంత్ కూడా ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో రేవంత్ ప్రభుత్వం ఆమెను అ ప్రాధాన్య పోస్టులోకి పంపించింది. కొంతకాలం అందులో పని చేసిన ఆమె ఆ తర్వాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవల తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెలవులో ఉన్నప్పటికీ స్మిత తన పంతాన్ని తెలంగాణ ప్రభుత్వంపై నెగ్గించుకున్నారు.
స్మిత అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కీలక వ్యవహారాలలో ముఖ్య పాత్ర పోషించారని రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచి అనుమానిస్తోంది. ఇటీవల పిసి ఘోష్ కమిటీ కూడా అదే విషయాన్ని వెల్లడించింది. తన నివేదికలో స్మిత పేరు ప్రస్తావించింది. ఆమెపై చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది.. అయితే దీన్ని సవాల్ చేస్తూ స్మిత తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. ఆ కేసును విచారించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.. పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకోవద్దని సూచించింది. “కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి నా పేరును పీసీ ఘోష్ కమిటీ ప్రస్తావించింది. నాపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. నాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని” స్మితా హై కోర్టును కోరారు.. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు పై విధంగా తీర్పు చెప్పింది. అంతేకాదు తదుపరి విచారణను అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది. మరోవైపు కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ రేవంత్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.