Sita Rama Lift Irrigation Project: గోదావరి జలాలు చెంతన పారుతున్నప్పటికీ వినియోగించుకోలేని దుస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులది. ఈ జిల్లాలో మెజారిటీ సాగు భూములు ఇప్పటికీ నాగార్జున సాగర్ కిందనే ఉన్నాయి. నాగార్జునసాగర్ గనుక నిండితే ఆయకట్టు రైతులు వరి సాగు చేస్తారు. లేకపోతే పొలాలను బీళ్లుగా పెడతారు. వాస్తవానికి సాగర్లో నీళ్లు ఉండగానే సరిపోదు.. అవి సక్రమంగా వస్తేనే పొలాలు పారుతాయి.. లేకపోతే మధ్యలోనే ఎండిపోతాయి.. ఈ పరిస్థితి గమనించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలకులు దుమ్ముగూడెం టెల్ ఫాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దీనిని నిర్మించాలని భావించారు. కాలక్రమంలో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. చివరికి తెలంగాణ ఏర్పాటు కావడంతో.. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడంతో తెరపైకి సీతారామ ఎత్తిపోతల పథకం వచ్చింది.
అనేక మార్పులు చేర్పుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టాలి అనుకున్న కుమ్మరిగూడెం వద్ద సీతారామ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీనిని అనేక ప్యాకేజీలుగా వర్గీకరించారు. ఈ ప్యాకేజీలవారీగా పనులు సాగుతున్నాయి. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించి తలపెట్టిన ఈ పథకం.. కొంతమేర పూర్తయింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ పథకం నిర్మాణం ఊపందుకుంది. సరిగ్గా గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు.. ఇప్పుడు మోటార్ ప్రారంభించి పొలాలకు నీటిని అందించడం మొదలుపెట్టారు.
వాస్తవానికి ఈ పథకం నిర్మాణంలో మొదట క్రెడిట్ ఇవ్వాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అనివార్యంగా కృష్ణ జలాలు రాకపోతే గోదావరి జలాలతో ఉమ్మడి జిల్లా రైతుల పంట పొలాలకు సరఫరా చేయాలని నాటి ప్రభుత్వ పెద్దలు భావించారు. ఇందులో భాగంగానే దుమ్ముగూడెం టైల్ ఫాండ్ స్కీం తెరపైకి తెచ్చారు. రాజకీయ కారణాల వల్ల ఆ పథకం కాస్త సీతారామ ఎత్తిపోతల పథకంగా మారిపోయింది. నాడు దుమ్ముగూడెం, ఇందిరా సాగర్ కోసం తీసుకొచ్చిన మోటార్లను భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వాడింది. ఆ తర్వాత సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్యాకేజీలుగా గులాబీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విభజించింది. అనంతరం ఈ పథకానికి సంబంధించిన పనుల విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యలు మొత్తం ఒక కొలిక్కి రావడానికి చాలా సమయం పట్టింది. అనంతరం పనులు మొదలయ్యాయి. ఇక మొదట్లో అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతానికి గోదావరి జలాలు ఇవ్వాలని భావించారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో తెలంగాణ సరిహద్దున ఉన్న అశ్వరావుపేట దాకా వెళ్తున్నాయి. ఇక్కడ కాల్వల నిర్మాణం కూడా పూర్తయింది . ఈ ప్రాంతంలో రైతులు కేవలం బోర్లు, వ్యవసాయ భావుల ద్వారానే పంట పొలాలు సాగు చేస్తున్నారు. కానీ ఇప్పుడు గోదావరి జలాలు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని పనులు పూర్తయితే మిగతా ప్రాంతాలకు కూడా సాగునీరు అందుతుంది.
Also Read: కూలీ మూవీ మోనికా సాంగ్ లో డాన్స్ ఇరగదీసిన మంజుమ్మెల్ బాయ్స్ హీరో ‘సౌబిన్ షాహిర్’!
ఈ పథకానికి మొదట కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి ఎత్తిపోతల పథకం గా మార్చింది. చివరికి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి రైతుల పొలాలకు నీరు అందించడం మొదలుపెట్టింది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ఈ గొప్పతనం మొత్తం తమకే దక్కుతుందని భారత రాష్ట్ర సమితి.. అసలు దీనికి మూలమే తాము అని.. విద్యుత్ ఖర్చు లేకుండా నీరు అందించాలని తాము అనుకుంటే.. విపరీతమైన ఖర్చుతో ఎత్తిపోతల పథకానికి సంకల్పించారని.. పనులు మధ్యలో నిలిపివేస్తే.. తదుపరి పనులు తాము పూర్తి చేసి నీరు సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి తమ పొలాలకు సాగునీరు రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కరువుకాలంలో పంటలు ముమ్మరంగా సాగు చేయడానికి ఆస్కారం ఉంటుందని సంబరపడుతున్నారు.