SIR Voter List: దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తమ వివరాలు ఓటరు జాబితాలో నమోదయ్యాయో లేదో ఓటర్లు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక SMS పంపడం ద్వారా తమ పేరు, పోలింగ్ వివరాలు, నియోజకవర్గం వంటి సమాచారం వెంటనే తెలుసుకునే అవకాశం కల్పించారు. అదెలాగంటే.
ముందుగా SIRలో మీ వివరాలు నమోదయ్యాయో లేదో తెలుసుకోవడానికి మొబైల్‌లో ECI అని టైప్ చేసి ఒక స్పేస్ ఇచ్చి, ఆ తర్వాత మీ ఓటరు గుర్తింపు సంఖ్య (EPIC Number) నమోదు చేయాలి. ఉదాహరణకు: ECI ABC1234567. ఈ మెసేజ్‌ను 1950 నంబర్‌కు పంపితే, కొద్ది సేపట్లోనే ఎన్నికల సంఘం నుంచి ప్రత్యుత్తరం వస్తుంది.
ఇలా మెసేజ్ పంపగానే రిప్లై వస్తుంది. ఇలా వచ్చిన మెసేజ్ లో మీ పేరు ఓటరు జాబితాలో నమోదై ఉంటే, రిప్లై SMSలో మీ పేరు, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్, పోలింగ్ కేంద్రానికి సంబంధించిన వివరాలు, నియోజకవర్గం పేరు వంటి సమాచారం కనిపిస్తుంది. ఈ వివరాలు వచ్చినట్లయితే SIR ప్రక్రియలో మీ నమోదు పూర్తయినట్లుగా భావించవచ్చు.
1950కు SMS పంపినా ఎలాంటి వివరాలు రాకపోతే లేదా సమాచారం తప్పుగా కనిపిస్తే, వెంటనే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ను సంప్రదించాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. BLO ద్వారా అవసరమైన పత్రాలు సమర్పించి, మీ వివరాలను సరిచేసుకోవచ్చు లేదా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. SIR ప్రక్రియలో భాగంగా BLOలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నారు. ఈ హౌస్ విజిట్ కార్యక్రమం ఆగస్టు 3తో ముగియనుంది. ఇంకా తమ వివరాలను నమోదు చేయించుకోని వారు లేదా సవరణలు చేయించుకోవాల్సిన వారు ఈలోపు BLOలను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
SIR ప్రక్రియ అనంతరం ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ (ప్రాథమిక ఓటరు జాబితా) విడుదల చేయనున్నారు. ఇందులో పేరు, చిరునామా లేదా ఇతర వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, ఎన్నికల సంఘం నిర్ణయించిన గడువులోపు అభ్యంతరాలు, సవరణల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఓటరు తమ పేరు SIRలో నమోదైందో లేదో ముందుగానే ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. ఒక సాధారణ SMSతోనే పూర్తి వివరాలు తెలుసుకునే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకువచ్చిన నేపథ్యంలో, ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
