Tealangana : తెలంగాణలో మద్యం అమ్మకాలు గడిచిన పదేళ్లలో ఏ ఏడుకాయేడు రికార్డులను తిరగరాస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేనంతగా అమ్మకాలు సాగుతున్నాయి. దేశంలోనే తెలంగాణ మద్యం అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచింది అంటే ఏమేరకు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. దీంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చుకుంది. జనంతో వీలైనంత ఎక్కువ మద్యం తాగించేందుకు బెల్టు షాపులను ప్రోత్సహించింది. ఎక్సైజ్ శాఖకు టార్గెట్ విధించి మరీ మద్యం అమ్మకాలు సాగించింది. ఇక మద్యం షాపుల లైసెన్స్ ఫీజులను భారీగా పెంచింది. మూడు నాలుగుసార్లు మద్యం ధరలను కూడా పెంచింది. ఇలా మద్యంతో కోట్ల రూపాయలు ఖాజానాకు కూడబెట్టింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో పయనిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్న రేవంత్‌రెడ్డి.. ఏడు నెలలు గడిచినా ఒక్క బెల్ట్ షాపును ముట్టుకోలేదు. మద్యం అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ విధించలేదు. ఎంత తాగితే అంత తాగించండి అన్నట్లుగా సైలెంట్‌గా ఉండిపోయారు. వేసవిలో బీర్ల కొరత తీర్చేందుకు కొత్త బీర్ల తయారీ కంపెనీలకు అనుమతులు కూడా ఇచ్చారు. ఇలా మద్యపానాన్ని తనవంతుగా ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ సర్కార్. రోజురోజుకు లిక్కర్ అమ్మకాలు జోరుగా పెరిగిపోతున్నాయి. అయితే ధర ఎంత ఉన్నా అమ్మకాలు మాత్రం ఆగవు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచాలనే ఆలోచేన చేస్తున్నట్లు తెలుస్తోంది.
10 నుంచి 12 శాతం..
బ్రూవరీలు ప్రస్తుతం బీర్ల ధరలు గిట్టుబాటు కావడం లేదని ప్రభుత్వానికి విన్నవించాయి. 10 నుంచి 12 శాతం ఎంచాలని ప్రతిపాదించాయి. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బీర్ల అమ్మకాలు కూడా తగ్గాయి. ఈ నేపథ్యంలో ధరల పెంపునకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అన్నట్లుగా బ్రూవరీలు ఎదురు చూస్తున్నాయి.
ఏటా రాష్ట్రంలో 68 కోట్ల బీర్లు..
ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఆరు బ్రూవరీల్లో ఏటా 68 కోట్ల లీటర్ల బీరు తయారు చేస్తున్నాయి. ఆ బీరును తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలుచేసి.. మద్యం దుకాణాలకు సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో 12 బీర్ల కేసుకుగాను బ్రూవరీలకు బేవరేజెస్ కార్పొరేషన్ రూ.289 చెల్లిస్తోంది. పన్నులన్నీ కలుపుకొని కేసుకు రూ.1,400 చొప్పున రిటైలర్లకు (మద్యం దుకాణాలు) విక్రయిస్తుండగా.. ఇతర ఖర్చులన్నీ కలిపి మద్యం దుకాణాలవారులు కేసు రూ.1,800 చొప్పున విక్రయిస్తున్నారు. అంటే ఒక్కో బీరుకు ప్రభుత్వం బ్రూవరీల నుంచి కేవలం రూ.24.08కి కొనుగోలు చేస్తుంది. మద్యం షాపులకు ఒక్కో బీరును రూ.116.66 ధరకు అమ్ముతుంది. వినియోగదారు నుంచి రూ.150 వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వ ఆర్డర్లపై బ్రూవరీలు బీర్లను ఉత్పత్తి చేస్తాయి.
రెండేళ్లకోసారి ఒప్పందం..
ఇక బీర్ల ధరలపై ప్రభుత్వం, బ్రూవరీలు రెండేళ్లకోసారి ఒప్పందం కుదుర్చుకుంటాయి. గడువు పూర్తయ్యాక ధరలను సవరిస్తాయి. ప్రతి రెండేళ్లకూ బ్రూవరీలకు చెల్లించే ధరను ప్రభుత్వం దాదాపు 10 శాతం మేర పెంచుతూ ఉంటుంది. చివరిసారిగా 2022 మేలో 6 శాతంచొప్పున రెండుసార్లు పెంచింది. నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈసారి 20–25 శాతం పెంచాలంటూ బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ మేర పెంచినట్లయితే ధరలను పెంచాల్సి ఉంటుంది. దీంతో ఈ ప్రభావం మందుబాబుపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 10 నుంచి 12 శాతం పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ధరలు పెంచాలని నిర్ణయిస్తే కేవలం బీర్లపైనే ఉండనుంది. మిగతా వాటి ధరలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More