Kavitha: జాగృతి వ్యవస్థాపకురాలు కవిత మొన్న హరీష్ రావు మీద చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. ఆ ఆరోపణలకు గులాబీ పార్టీ నాయకులు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఆరోపణలకు ప్రత్యారోపణలు సమాధానంగా ఉంటే సరిపోయేది. కాకపోతే అవి వ్యక్తిగత జీవితాల వరకు రావడంతోనే అసలు సమస్య మొదలవుతోంది. వాస్తవానికి ఆమె పై గులాబీ పార్టీ నాయకులు ఈ స్థాయిలో విమర్శలు చేస్తారని.. వ్యక్తిగత జీవితాలను నటి బజార్లో పెడతారని సగటు తెలంగాణ వాది ఊహించలేదు. వాస్తవానికి కవితపై కొంతకాలంగా వ్యూహాత్మక దాడి జరుగుతుందని జాగృతి నాయకులు అంటున్నారు.. ఇదే విషయాన్ని కవిత అనేక సందర్భాల్లో బయటపెట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడికి కూడా చెప్పారు. అయినప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. చివరికి పార్టీ అధినేతకు ఆమె లేఖలు కూడా రాశారు. వాటి వల్ల కూడా ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా ఆమె పార్టీలో ఉన్న పరిస్థితిపై అసలు విషయాలను బయటపెట్టారు. ఇటీవల ఇద్దరు కీలక నాయకుల మీద ఆరోపణలు చేశారు. అయితే ఆ ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసి ఉంటే బాగుండేది. కానీ తమ స్థాయిని మర్చిపోయి.. కవిత స్థాయిని మర్చిపోయి గులాబీ నేతలు చేస్తున్న విమర్శలు అత్యంత దారుణంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియోలు కనిపిస్తుండడం అత్యంత దారుణంగా ఉంది.
వాస్తవానికి రాజకీయాలలో వ్యక్తిగత జీవితాలకు తావులేదు. కానీ ఈ విషయాలను గులాబీ పార్టీ నాయకులు మరిచిపోతున్నారు. ఆవేశంతో.. పట్టరాని ఆగ్రహంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ప్రతి ఆరోపణలతో బదులు ఇవ్వాల్సింది పోయి వ్యక్తిగత జీవితాలను బయటపెడుతున్నారు. జాగృతి వ్యవస్థాపకరాలు, నీటిపారుదల శాఖ మంత్రికి గొడవ ఇప్పటిది కాదని.. గతంలో హరీష్ రావు తమ్ముడితో కవితకు ఎంగేజ్మెంట్ జరిగిందని.. తర్వాత అది క్యాన్సిల్ అయిందని.. అప్పటినుంచి హరీష్ రావు అంటే కవితకు కోపమని.. గులాబీ పార్టీ నాయకుడు ఈ ప్రకాష్ ఆరోపించారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని.. కవిత మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఆమె అనిల్ ను వివాహం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా హరీష్ మీద అప్పటినుంచి కోపం పెంచుకున్నారని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో గులాబీ పార్టీ సెక్రటరీ కూడా పాల్గొన్నారు. ఆయన కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించడం విశేషం. వాస్తవానికి కవితను గులాబీ పార్టీ నాయకులు అక్కగా సంబోధిస్తారు. ఆమెకు పార్టీ మీద పట్టు కూడా ఎక్కువే. గులాబీ పార్టీ అధినేత కుమార్తెను ఎంతపడితే అంత మాట అనడానికి ఆ పార్టీలో ఉన్న నాయకులు వెనుకంజ వేయడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గులాబీ పార్టీ అధినేత బతికి ఉండగానే కవిత మీద ఈ స్థాయిలో దాడి జరుగుతుందంటే.. రాజకీయాలు ఎంత దారుణంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. మరి దీనిపై గులాబీ అధినేత ఏం చేస్తారు.. నాయకులకు ఎలాంటి సూచనలు చేస్తారు.. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తెలంగాణ సమాజం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.