Hardik Pandya And Krunal Pandya: ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలని చెప్తుంది మన ధర్మం. అలాంటివారే జీవితంలో పైకొస్తారని దాని అర్థం. దీని పాటించేది కొంతమంది మాత్రమే. అలాంటి వారిలో పాండ్యా సోదరులు ఉంటారు. గుజరాత్ లోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చారు.. క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నారు. హార్థిక్ పాండ్యా అటు జాతీయ జట్టులో.. ఇటు ఐపీఎల్లో ముంబై జట్టులో అదరగొడుతున్నాడు. అతడు ముంబై జట్టుకు ఏకంగా నాయకత్వం కూడా వహిస్తున్నాడు. మరోవైపు క్రునాల్ పాండ్యా బెంగళూరు జట్టులో కీలకమైన బౌలర్గా మారాడు. ఇటీవల బెంగళూరు జట్టు ipl ట్రోఫీ అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో కృనాల్ పాండ్యాది కీలక పాత్ర.
పాండ్యా సోదరులు దిగువ స్థాయి నుంచి ఇక్కడదాకా వచ్చారు. వీరు ఇక్కడ దాక రావడంలో చిన్ననాటి శిక్షకుడు జితేంద్ర సింగ్ ముఖ్యపాత్ర పోషించారు. ఆయన శిక్షణలో పాండ్యా సోదరులు రాటు తేలారు. ప్రపంచ క్రికెట్ యవనిక మీద ఈ స్థాయిలో సత్తా చాటుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం జితేంద్ర. చిన్నప్పుడు పాండ్యా సోదరులకు క్రికెట్ మీద ఆసక్తి పెరగడానికి.. క్రికెట్లో అద్భుతమైన నైపుణ్యం సాధించడానికి జితేంద్ర కీలక పాత్ర పోషించాడు. రేయింబవళ్లు వారితో సాధన చేయించేవాడు. ముఖ్యంగా హార్దిక్ తో బౌలింగ్.. బ్యాటింగ్ చేయించేవాడు. ఫీల్డింగ్ విభాగంలో కూడా హార్దిక్ కు అద్భుతమైన పాఠాలు చెప్పాడు. క్రునాల్ మిస్టీరియస్ స్పిన్ బౌలర్ అయ్యాడు అంటే దానికి ప్రధాన కారణం జితేంద్ర అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.
ముందుగానే చెప్పినట్టు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పాండ్యా సోదరులు.. తమ ఉన్నతికి కారణమైన జితేంద్రకు ఏదైనా చేయాలి అనుకున్నారు. పైగా జితేంద్ర ఇటీవల పడుతున్న ఆర్థిక ఇబ్బందులను తెలుసుకొని ఏకంగా 80 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. జితేంద్ర చిన్న చెల్లెలు వివాహం కోసం 20 లక్షలు ఇచ్చారు. అతడు కారు కొనుగోలు చేయడానికి 20 లక్షలు ఇచ్చారు. తల్లి వైద్య చికిత్సల కోసం కొంత నగదు ఇచ్చారు. ఇతర అవసరాల కోసం పదినిలక్షల వరకు ఇచ్చారు. మొత్తంగా 80 లక్షల వరకు ఇచ్చారని.. ఇది నా శిష్యులు నాకు పెట్టిన భిక్ష అని జితేంద్ర ఇటీవల పేర్కొన్నాడు..”నా కష్టాలు నేను ఎవరికీ చెప్పుకోను. కానీ పాండ్యా సోదరులు ఎలా తెలుసుకున్నారో తెలియదు. నాకు తెలియకుండానే అన్ని సమకూర్చారు. ఇదంతా ఎవరిస్తున్నారని మొదట్లో తెలిసేది కాదు. తెలియనిచ్చేవారు కాదు. చివరికి పాండ్యా సోదరుల త్యాగం తెలిసిన తర్వాత నా కంట నీరు ఆగలేదు. ఎంతో అదృష్టం చేసుకుంటే ఇలాంటి శిష్యులు దొరికారు. వారికి నా ధన్యవాదాలని” జితేంద్ర వ్యాఖ్యానించాడు.