CM KCR: రాజకీయాల్లో ప్రతీ పార్టీకి ఏదో ఒక సమస్య ఉంటుంది. విపక్ష పార్టీల్లో సమస్యలు కాస్త ఎక్కువ. అధికార పక్షానికి పెద్దగా సమస్యలు ఉండవు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మాత్రం ఏటా సెప్టెంబర్ 17 పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చి.. వాటిని ఇవ్వలేదని.. సాధ్యం కాదని.. హామీ నెరవేర్చకున్నా.. ప్రజలు మమ్మల్నే గెలిపిస్తున్నారని ధైర్యంగా చెప్పగలుగుతున్న కేసీఆర్.. ఒక్క సెప్టెంబర్ 17 విషయంలో మాత్రం వెనుకడుగు వేస్తున్నారు. తన మిత్రపక్షమైన ఎంఐఎం కోసం తెలంగాణ విమోచన దినం నిర్వహించేందుకు వెనుకాడుతున్నారు.. కాదు కాదు.. భయపడుతున్నారు.
నాడు నిర్వహించాలని గగ్గోలు..
2001లో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి కేసీఆర్ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. నాటి కాంగ్రెస్ పాలకులు ఎంఐఎంకు భయపడుతున్నారని, కొంతమంది ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో గగ్గొలు కూడా పెట్టారు. నాడు ఎంఐఎం కాంగ్రెస్‌కు మిత్రపక్షంగా ఉంది.
సొంతంగా నిర్వహణ..
నాడు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ సెప్టెంబర్ 17ను తామే నిర్వహిస్తామంటూ హంగామా చేసింది. ఏటా సెప్టెంబర్ 17న ప్రభుత్వ కార్యాలయాలపై, టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకం ఎగురవేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు అడ్డుకుంటే.. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. సెప్టెంబర్ 17 రాగానే జాతీయ జెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చేవారు. కార్యకర్తలు కూడా జెండాలు ఎగురవేసేవారు.
అధికారంలోకి రాగానే గప్‌చుప్..
ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకేముంది అధికార పార్టీ పంచన చేరే ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో నాడు తెలంగాణ విమోచనం నిర్వహించాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. ఎంఐఎం దోస్తీ కారణంగా తెలంగాణ విమోచనను విస్మరించారు.
పదేళ్లుగా నిర్వహణ లేదు…
అధికారంలోకి వచ్చి పదేళ్లు గడిచింది. అయినా కేసీఆర్ అధికారికంగా తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో సెప్టెంబర్ 17న విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తున్నారు. కానీ కేసీఆర్ కేవలం ఎంఐఎంతో దోస్తీ, మైనారిటీల ఓట్లు పోతాయనే భయంలోనే విమోచనకు వెనుకాడతున్నారు. విమోచనం అంటే నిజాంకు వ్యతిరేకం.. నిజాం నియమించిన రజాకార్లకు వ్యతిరేకం. అందుకే కేసీఆర్ భయపడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
విమోచనకు కొత్త భాష్యం ..
ఇదిలా ఉంటే.. తెలంగాణ చరిత్రను కనుమరుగు చేస్తున్నారని సమైక్య రాష్ట్రంలో గగ్గోలు పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు అధికారంలో ఉండి ఆయన అదే చేస్తున్నారు. తెలంగాణ విమోచనకు కొత్త భాష్యం చెబుతున్నారు. తెలంగాణ సమైక్యత దినం అది ప్రకటించారు. ఈమేరకు రెండేళ్లుగా సెప్టెంబర్ 17న జాతీయ జెండాలు ఎగుర వేస్తున్నారు.
ఓన్ చేసుకుంటున్న బీజేపీ..
ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఏటా వేడుకలు నిర్వహిస్తోంది. ఇక కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యాక.. ఆయన శాఖ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తున్నారు. గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే.. కర్ణాటక మంత్రి హాజరయ్యారు. ఈసారి కూడా వేడుకలకు కిషన్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విమోచన దినం నిర్వహించని కాంగ్రెస్ కూడా ఈసారి వేడుకల నిర్వహిస్తామంటోంది. కాంగ్రెస్ అధిష్టానం సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తుండడంతో విమోచన దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. కేసీఆర్ మాత్రమే.. ఒక వర్గం ఓట్ల కోసం తెలంగాణ చరిత్రనే చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు.