Teenmar Mallanna: ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీసీ ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హోదాలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ” రెడ్డి కులస్తులు ఓట్లు మాకు వద్దు. వారి ఓట్లు వాళ్ళే వేసుకోవాలి. ఎందుకంటే వారితో మాకు సోపతి తక్కువ. అలాంటప్పుడు మేము బతిమిలాడినప్పటికీ మాకు ఓట్లు వేయరు.. అలాంటప్పుడు ఓట్లు అడిగి కూడా వృధానే. అందువల్లే రెడ్డి కులస్తుల ఓట్లు మాకు వద్దు. మా బీసీల ఓట్లు మాత్రమే మాకు సరిపోతాయి. మా బీసీలు సంఘటితంగా ఉంటే సరిపోతుంది. వేరే వాళ్ళ ఓట్లు మాకెందుకు. వాళ్ల ఓట్లతో మేము అధికారంలోకి వచ్చేది ఏమైనా ఉందా? వాళ్లు మొదటి నుంచి అధికారానికి అలవాటు పడ్డారు. అధికారం దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తారు. ఇప్పటివరకు వాళ్లే ముఖ్య పదవులను అనుభవించారు. వాళ్ల జనాభా ఎంత ఉందో అందరికీ తెలుసు. అయినప్పటికీ మిగతా సమాజాన్ని మొత్తం వారు పరిపాలిస్తున్నారు.. ఇది సరైన విధానమా? రాజ్యాంగం ఇదే చెబుతోందా? రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్లంతా దీనిని సమర్థిస్తారా” అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు..
కలకలం
తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. తీన్మార్ మల్లన్న గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత బయటికి వచ్చి సొంతంగా యూట్యూబ్ ఛానల్, పీడీఎఫ్ పేపర్ కొనసాగిస్తున్నారు.. ఈ క్రమంలో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటి నుంచి ప్రశ్నించే స్వభావాన్ని ఆయన ప్రదర్శించారు. ప్రభుత్వంలో తప్పులను.. ప్రభుత్వ అధికారులు చేస్తున్న అన్యాయాలను ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో ఓ వర్గం నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. ఏమాత్రం ఆయన వెనుకంజ వేయలేదు. ఆ మధ్య తీన్మార్ మల్లన్న పై ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ టికెట్ సాధించిన అతను.. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేష్ రెడ్డి పై విజయం సాధించారు. గతంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన మల్లన్న.. ఈసారి మాత్రం ఆ తప్పును పునరావృతం చేయలేదు. అయితే ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత కూడా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే స్వభావాన్ని వదులుకోలేదు. అంతేకాదు అధికార పార్టీ తప్పులను నేరుగా ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు.. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.. మరి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా సమర్థిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరో వైపు గతంలో తీన్మార్ మల్లన్న గతంలో చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఆ తర్వాత ఆ వివాదం అలా సర్దుమణిగింది. మరి ఇప్పుడు ఇది ఏ వైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగుతున్నారు. అయినప్పటికీ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గం టార్గెట్ గా వ్యాఖ్యలు చేయడం విశేషం.
రెడ్ల ఓట్లు మాకొద్దు.. వాళ్లు బతిలాడినా మాకు ఓట్లు వేయరు. మాకు ఓట్లు వేయని వారి సోపతి మాకెందుకు..
-కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ #teenmarmallanna pic.twitter.com/bNR14ZqE8u— Anabothula Bhaskar (@AnabothulaB) January 29, 2025