Runa Mafi: తెలంగాణలో 2023, మేలో వరంగల్‌లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రూ.2 లక్షల వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్‌రెడ్డి రైతుల పంట రుణాల మాఫీకి శ్రీకారం చుట్టారు. ఈమేరకు సుదీర్ఘ కసరత్తు తర్వాత జూలై 18న రుణ మాఫీకి శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో రూ.లక్ష, రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. మొదటి విడత జూలై 18, రెండో విడత జూలై 30న మాఫీ చేశారు. మూడో విడత మాఫీ ఆగస్టు 15న చేశారు. ఇదిలా ఉంటే. మూడు విడతల్లో రుణమాఫీ అర్హులను ప్రభుత్వం గుర్తించింది. అయితే చాలా మంది పంట రుణాలు మాఫీ కాలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయాధికారులు, బ్యాంకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో రుణమాఫీ కాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. దీని వల్ల రుణ మాఫీ డబ్బులు రాని రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు.
స్పెషల్ డ్రైవ్ దార్వా గుర్తింపు..
రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉండి రుణమాఫీ కానివారిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సాంకేతిక కారణాలతో మాఫీ కానివారిని గుర్తించి వారికి కూడా ఊరట కలిగిస్తామని తెలిపారు. నెల రోజులు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆధార్, పాస్ బుక్ పేపర్లలో మార్పులు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురికి రైతు రుణ మాఫీ కాలేదని తెలిపారు.
త్వరలో స్పెషల్ డ్రైవ్..
రుణమాఫీ కాని రైతులకు లబ్ధి చేకూర్చేందుకు, సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టే డ్రైవ్‌పై నేడో రేపో ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ డ్రైవ్ ఎప్పటి నుంచి చేపడతారు.. మాఫీ కాని రైతులు ఏమేం సిద్ధం చేసుకోవాలి, స్పెషల్ డ్రైవ్‌లో అధికారులకు సమర్పించాల్సిన పత్రాలు ఏమిటి. బ్యాంకులకు తీసుకెళ్లాల్సిన పత్రాల వివరాలను ప్రకటిస్తారు. డ్రైవ్‌లో పాల్గొనే అధికారుల వివరాలను కూడా జిల్లాల వారీగా ప్రకటించే అవకాశం ఉంది. అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.