Double Decker Buses: ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై గంభీరంగా తిరిగిన ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. నాడు తీవ్ర నష్టాలు రావడంతోనే వాటిని సంస్థ క్రమంగా వదిలించుకుంది. ఈమేరకు అశోక్ లేలాండ్ అనుబంధ స్విచ్ మొబిలిటీతో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దుచేసుకుంది.
కేటీఆర్ ఒత్తిడితో..
నగరంలో 2004 వరకు డబుల్ డెక్కర్ బస్సులు నడిచాయి. నిర్వహణలో నష్టాలు పెరుగుతుండడంతో వాటిని ఆర్టీసీ పక్కన పెట్టింది. మూడేళ్ల క్రితం నగరవాసి ఒకరు పాత డబుల్ డెక్కర్ ఫొటోను షేర్‌చేస్తూ, నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు నడిపితే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా నాటి మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. డబుల్ డెక్కర్ బస్సులు నడిపే అవకాశాన్ని పరిశీలించాలని రవాణాశాఖకు సూచించారు. దీనికి రవాణాశాఖ కూడా ఓకే చెప్పింది. ప్రయోగాత్మకంగా డబుల్ డెక్కర్ బస్సులు నేడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.
ఆటంకాలు లేని మార్గంలో...
ఫ్లై ఓవర్లు, ఫుట్ ఓవర్ వంతెనలు లేని మార్గాలను ఎంపిక చేసింది. ఈమేరకు సుచిత్ర మీదుగా సికింద్రాబాద్, మేడ్చల్ మధ్య, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ – పటాన్ చెరు, అమీర్‌పేట మీదుగా క కోటి–పటాన్‌చేరు, సీబీఎస్–జీడీఎమట్ల, దుర్గం చెరువు కేబుల్ వంతెనల మీదుగా డబుల్ డెక్కర్ నడపాలని నిర్ణయించింది. దీంతో దేశంలోని పలు నగరాలకు డబుల్ డెక్కర్ బస్సులు సరఫరా చేస్తున్న స్విచ్ మొబిలిటీ సంస్థ బస్సుల సరఫరా టెండర్లు దక్కించుకుంది. అయితే ధర ఇంకా ఖరారు కాలేదు.
ప్రభుత్వం మారడంతో..
అంతా ఓకే అనుకుని బస్సులు సరఫరా చేసే వేళ రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. ప్లై ఓవర్లు, పాదచారుల వంతెనలతో డబుల్ డెక్కర్ బస్సుల నిర్వహణ ఇబ్బందే కాకుండా నష్టాలు వస్తాయని తెలిసినా నాటి మంత్రి కేటీఆర్ ఒత్తిడితో ఆర్టీసీ అంగీకరించింది. ప్రభుత్వం మారడంతో ప్రతిపాదనను విరమించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఓల్వోలాంటి విదేశీ బ్రాండ్ సర్వీసుల నిర్వహణనే భారంగా భావిస్తున్న తరుణంలో డబుల్ డెక్కర్ జోలికి వెళ్లొద్దని నిర్ణయించుకుంది.