PVG Raju: యావదాస్తిని ప్రజలకు దానమిచ్చిన విజయనగరం చివరి రాజు.. ఎంతో తెలుసా?

విజయనగర మహారాజ్ అలక్ నారాయణ గజపతిరాజు,మహారాణి విద్యావతి దంపతుల పెద్ద కుమారుడే పి వి జి రాజు. సంస్థానానికి చిట్టచివరిగా ఈయనే పట్టాభిషేకం అయిన రాజు.

Written By: Dharma, Updated On : May 1, 2024 10:47 am

PVG Raju:

Follow us on

PVG Raju: విజయనగరం.. విద్యల నగరి. ఎంతోమంది మహనీయులు నడయాడిన నేల. సంగీతం, సాహిత్యం, కళా రంగాలకు నెలవు. ఎంతోమంది ప్రముఖులను జాతికి అందించింది ఈ నగరం. కానీ ఈ చరిత్ర వెనుక ఓ మహనీయుడు దార్శనీకత ఉంది. సంగీత సారస్వతాల్లో ఆయన అందించిన సహాయ సహకారాల వల్లే ఇది సాధ్యమైంది. ఆయనే డాక్టర్ పివిజి రాజు. విజయనగరం సామ్రాజ్యానికి చిట్ట చివరి పట్టాభిషిక్తుడైన రాజు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తండ్రి. పివిజి రాజు శతజయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

విజయనగర మహారాజ్ అలక్ నారాయణ గజపతిరాజు,మహారాణి విద్యావతి దంపతుల పెద్ద కుమారుడే పి వి జి రాజు. సంస్థానానికి చిట్టచివరిగా ఈయనే పట్టాభిషేకం అయిన రాజు. ఉత్తర కోస్తా తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తన ఆస్తిని విరాళంగా ఇచ్చారు. విజయనగరం సంస్థానానికి ఒడిస్సా నుంచి మచిలీపట్నం వరకు ఉన్న ఆస్తులను పైసా పరిహారం ఆశించకుండా ప్రభుత్వానికి దానం చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన 15 వేల ఎకరాలను మాన్సాస్ ట్రస్ట్ కు ఇచ్చారు. ఇంటి పెద్దగా వచ్చిన జేష్ఠ భాగాన్ని ప్రజాధనం గా భావించి.. రాజ్యంలో ఉన్న ఆస్తులు మొత్తాన్ని పీవిజీ దానమిచ్చారు.

మాన్సస్ ట్రస్ట్ పరిధిలో 105 దేవాలయాలు, 14800 ఎకరాల భూములు, 13 విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల కోసం బ్యాంకుల్లో 124 కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారు. 60 ఏళ్ల తర్వాత అన్ని వదిలి సింహాచలం గోశాలలో దైవచింతనలో గడిపారు. 1995 నవంబర్ 14న విశాఖలో పీవీజీ రాజు కన్నుమూశారు. ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం చిరస్మరణీయం. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు అశోక్ గజపతిరాజు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, దేవస్థానాల శాశ్వత ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు నిస్వార్ధంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో పివిజి రాజు శతజయంతి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.