RTC Bus Strike: ఆర్టీసీ బస్సులు డిపో దాటలేదు. మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు నరకం చూస్తున్నారు. అసలే ఎండాకాలం.. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ప్రయాణికుల కష్టాలు మామూలుగా లేవు.
కొంతకాలంగా తమ సమ్మె చేస్తామని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు వారిని సముదాయిస్తున్నారు. పలు దఫాలుగా చర్చ జరిగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల బృందం ఆధ్వర్యంలో చర్చలు నిర్వహించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో తాము సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించారు.
ప్రధానంగా ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. ఆర్టీసీకి ఇవ్వాలని కోరుతున్నారు. మహాలక్ష్మి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్, బ్రెడ్ విన్నర్, ఇతర కార్మికులను తక్షణమే సంస్థలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.. ట్రేడ్ యూనియన్ నేతలపై ఆంక్షలు సడలించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇంకా కొన్ని డిమాండ్లపై అనేక దఫాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో సమ్మె అనివార్యంగా మారింది.
ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని కార్మికులు అంటున్నారు. పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ.. ప్రభుత్వం కాలయాపన చేసిందని.. కనీసం సానుకూల ఫలితాలు వచ్చే విధంగా చేయలేదని మండిపడుతున్నారు. “ప్రభుత్వమే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పింది. ప్రభుత్వంలో విలీనం చేస్తామని అంది. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ జరగలేదు. పైగా రోజులుగా కాలయాపన చేస్తూనే ఉన్నారు. మా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వ పెద్దలకు మనసు ఒప్పలేదు. అందువల్లే కమిటీలు అంటూ కాలం గడిపారు. చివరికి మమ్మల్ని గాలికి వదిలేసారు. గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సి వచ్చిందని” ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.
ప్రస్తుతం శుభకార్యాలు జరుగుతున్నాయి.. వరుసగా వివాహాలు కూడా ఉన్నాయి. ఇలాంటప్పుడు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. పైగా ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో మహిళలు ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. ఏ మహాలక్ష్మి పథకం ద్వారా అయితే మహిళల్లో మంచి పేరు వచ్చిందో.. సమ్మె వల్ల ప్రభుత్వానికి అంతకుమించిన చెడ్డ పేరు వస్తుందని.. అది కూడా మహిళల నుంచి వస్తుందని కార్మికులు అంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించి.. ప్రభుత్వం ఆర్టీసీకి సరికొత్త జవసత్వాలను అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.