RS Praveen Vs Sajjanar: ఒకప్పుడు రాజకీయ నాయకుల మధ్య విభేదాలు ఉండేవి. రాజకీయ నాయకులు మాత్రమే సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిపక్ష నాయకులు వర్సెస్ అధికారులు అన్నట్టుగా పరిస్థితి రూపాంతరం చెందింది.
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా కొంతమంది పోలీసు అధికారులను టార్గెట్ చేసేవారు.. వారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేవారు. అప్పట్లో ఈ తరహా విమర్శలు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఎదుర్కొన్న వారిలో పురపాలక శాఖను పర్యవేక్షించిన అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఇంకా కొంతమంది అధికారులు ఉన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కు నోటీసులు అందించింది. వారిని విచారించింది. కేటీఆర్, హరీష్ రావు ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించిన నేపథ్యంలో తెరపైకి గులాబీ పార్టీ నేతలు వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులను విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి సజ్జనార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ ను ఉద్దేశించి గులాబీ పార్టీ కీలక నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన విమర్శలు చేశారు.
“ఆరోజు నోటుకు ఓటు కేసులో సజ్జనార్ అధికార దుర్వినియోగం చేశాడని కేసులు.. ఇప్పుడు అదే సజ్జనార్ ఈ కేసు విచారణ చేస్తా అంటున్నాడు. ప్రజా ప్రతినిధులను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి సజ్జనార్ చీఫ్ గా ఉన్నాడు. సజ్జనార్ సిట్ ను లీడ్ చేసి, ఈ వ్యవహారాన్ని విచారించే నైతిక అర్హత లేదు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగగా అరెస్టు అయినప్పుడు ఎస్ ఐ జీ సజ్జనార్ ఉన్నాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రస్తుత డిజిపి శివధర్ రెడ్డి ఉన్నాడు. ఆనాడు ఈ సజ్జ నార్ ఇంకా కొంతమంది అధికారులు ఫోన్ లు ట్యాప్ చేసారని ఏపీ లో కేసులు ఉన్నాయని” ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలో సజ్జనార్ నోటీసులు పంపించారు. ” నాపై ఎక్కడ ఏడు కేసులు ఉన్నాయో.. పోలీస్ స్టేషన్ వివరాలు, నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని” సజ్జ నార్ నోటీసులు అందించారు. దీంతో ఇప్పటిదాకా రేవంత్ వర్సెస్ బీ ఆర్ ఎస్ అన్నట్టుగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక్కసారిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ సజ్జ నార్ అన్నట్టుగా మారిపోయింది.