RK Kothapaluku: “కారుతో కమలం దోస్తీ ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరుగుతున్నాయి. కెసిఆర్ తన నుంచి సంకేతాలు పంపాడు.. త్వరలో ఏదైనా జరగొచ్చు.. అమిత్ షా ఇప్పటికే పొత్తు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పార్టీ నాయకులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో త్వరలో కమలం పార్టీతో కారు పొత్తు పెట్టుకునే అవకాశం కొట్టి పారేయలేనిది. కమలం పార్టీతో పొత్తుకు సంబంధించి ఛాయిస్ కేసీఆర్ చేతిలో లేదు. అందువల్లే ఆయన మౌనంగా ఉంటున్నారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, మజ్లీస్ కు 54 మంది శాసనసభ్యుల బలం ఉంది. కాంగ్రెస్ సభ్యులు పక్క చూపులు చూసినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. అందువల్లే ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు” ఇవీ ఆదివారం నాటి కొత్త పలుకులో ఆంధ్రజ్యోతి ఎండి కం సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణ రాసిన కొన్ని ఆణిముత్యాలు.
బిజెపితో పొత్తు పెట్టుకోవాలంటే ఆ అంశం కేసీఆర్ పరిధిలో లేకపోవడం ఏమిటి? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మజ్లీస్ రహస్య స్నేహం కొనసాగిస్తోంది. అలాంటప్పుడు అది కారు పార్టీతో ఎందుకు దోస్తీ చేస్తుంది? కమలం, కారు కలిసి ప్రయాణం చేస్తే మధ్యలోకి మజ్లీస్ ఎలా వస్తుంది? కమలంతో కలిసి ప్రయాణం చేస్తే మజ్లీస్ పార్టీకి తెలంగాణలో పుట్టగతులు ఉంటాయా? ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన వివాదాస్పద పనులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. అలాంటప్పుడు ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు? ఇవన్నీ రాధాకృష్ణ ఎలా మర్చిపోయాడు..
ఇప్పటి వరకైతే రేవంత్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నరేంద్ర మోడీ వద్ద అతడు అణిగిమణిగి ఉంటున్నాడు. రేవంత్ ను ఇబ్బంది పెట్టడానికి పెద్దగా కేసులు ఏమీ లేవు. ఆ ఓటుకు నోటు కేసు ఇప్పట్లో తేలే అవకాశం లేదు. పైగా మొన్నటి బడ్జెట్లో కేంద్రం పెద్దగా కేటాయింపులు జరుపకపోయినప్పటికీ రేవంత్ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అంటే కెసిఆర్ తిక్క తిక్కగా వ్యవహరించాడు కాబట్టి కేంద్రం కూడా ఆగ్రహం గానే ఉండేది. పలు మార్లు తెలంగాణకు నరేంద్ర మోడీ వచ్చినప్పటికీ అధికారికంగా స్వాగతం పలకలేదు.. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అలా ఉండటం లేదు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత భట్టి విక్రమార్క తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఏం కావాలో అడిగారు. అమిత్ షాను కూడా మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు గురించి మాట్లాడారు. ఆ తర్వాత కేంద్రం తెలంగాణ విషయంలో రేవంత్ రెడ్డి కోరినట్టుగానే వ్యవహరించింది.. సో ఇక్కడ కేంద్రం తెలంగాణపై కక్షకట్టే అవకాశాలు ఇప్పటికైతే లేవు. మరోవైపు ఇక్కడి బిజెపి నాయకులు పెద్దగా కాంగ్రెస్ పై ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవు.
ఇటీవల రేవంత్ రెడ్డిని వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేసినప్పుడు.. పార్టీ ఫిరాయింపుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ వారు తమ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే.. అంతకంటే దిగజారుతామని రేవంత్ అన్నారు.. అలాంటప్పుడు కెసిఆర్ అలాంటి ప్రయత్నాలు చేస్తారా? అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారం అనుభవిస్తామంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు? ఇవన్నీ కెసిఆర్ కు తెలియక కాదు.. కెసిఆర్ పార్టీ ప్రస్తుతం ఇబ్బంది పడుతోంది కాబట్టి.. తన పార్టీని బతికించుకునేందుకు ఏవేవో సంకేతాలు విడుదల చేస్తుంటారు.. వాటికి కొంచెం మసాలా అద్ది రాధాకృష్ణ లాంటివాళ్ళు రాస్తూ ఉంటారు. అంతకుమించి ఏమీ ఉండదు.