RK Kotha Paluku: తీవ్రమైన పోటీ మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.. సాధారణ విజయం కాకుండా, బంపర్ మెజారిటీతో గెలుపు అందుతుంది.. వాస్తవానికి ఈ గెలుపును కొన్ని మీడియా సంస్థలు ఒక విధంగా.. మిగతా మీడియా సంస్థలు మరొక విధంగా విశ్లేషణ చేస్తున్నాయి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరగబోతుంది? అనే విషయాలను ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బయటపెట్టారు.. ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు పేరుతో వర్తమాన రాజకీయాలపై ఆయన విశ్లేషణ చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని ఆయన ఈ ఆదివారం కొత్త పలుకులో ప్రధానంగా ప్రస్తావించారు.
ఈ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో మరింత లోతులను తెలుసుకున్నారు.. ఎత్తులను ఒంట పట్టించుకున్న రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అమలు చేశారు.. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి మినహా మిగతా మంత్రులకు గెలుస్తామని నమ్మకం లేదు. కాలికి బలపం పెట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి.. అంతిమంగా పార్టీని గెలిపించి చూపించారు. ఈ గెలుపు ద్వారా రేవంత్ రెడ్డి పార్టీ మీద.. ప్రభుత్వం మీద మరింత పట్టు సాధిస్తారు. ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలకు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తారు..
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. పార్టీలో క్రమశిక్షణను పెంపొందించాలి. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలిగించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజల్లో గుణాత్మక మార్పు రాదు. హైదరాబాద్ ప్రజలలో కూడా ఊహించిన అభివృద్ధి కనిపించదు.. ఇల్లు అలకగానే పండగ కానట్టు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో గెలవగానే రేవంత్ రెడ్డికి పండగ కాదు.. ఎందుకంటే ఆయన ఎదుట సవాళ్లు చాలా ఉన్నాయి.. పట్టణ ప్రాంతంలో పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది. గ్రామీణ ప్రాంతాలలో వ్యతిరేకత కొంతమేర కనిపిస్తోంది.. వీటన్నిటిని రేవంత్ తగ్గించాలి. ఇవన్నీ జరగాలంటే ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.. ఇదిగో ఇలా సాగిపోయింది రాధాకృష్ణ విశ్లేషణ.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు రేవంత్ ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారు? ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డారు? గులాబీ అనుకూల మీడియాలో ఎటువంటి వార్తలు వచ్చాయి? అనే విషయాలపై రాధాకృష్ణ కూలంకశంగా విశ్లేషణ చేశారు. అయితే ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఉన్నాయి.. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం అధినేత ఓవైసీ ప్రతిపాదించారట.. దానికి రేవంత్ కూడా ఒప్పుకున్నారట. నవీన్ యాదవ్ ను ఎన్నికలలో నిలబెడితే అజహారుద్దీన్ నుంచి ఇబ్బంది ఎదురవుతుందని భావించి.. ఆయనకు మంత్రి పదవి ఇప్పించారట. ఇదే విషయాన్ని అధిష్టానం ముందు చెప్పి ఒప్పించారట. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా మంది కష్టపడి పని చేశారు. పది సంవత్సరాలపాటు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ అటువంటివారిని పక్కనపెట్టి కేవలం మధ్యలో లాబీయింగ్ చేసుకునే వారికి మాత్రమే పదవులు ఇచ్చారని రాధాకృష్ణ చెప్పకనే చెప్పారు.
ఈ ప్రకారం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఓపెన్ గా అనేశారు. ఈ పరిణామాలను నాయకులు, కార్యకర్తలు పరిశీలిస్తున్నప్పుడు.. పార్టీ మీద నమ్మకాన్ని ఎలా పెట్టుకుంటారు.. పార్టీలో కష్టపడి పని చేస్తే పదవులు వస్తాయని ఎలా భావిస్తారు.. ఒకప్పుడు రాజకీయాలంటే సేవ మాత్రమే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు రేవంత్ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు.. ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం లభించాల్సి ఉంది.
ఇక మిగతా విషయాలపై కూడా రాధాకృష్ణ తన మార్క్ విశ్లేషణ చేశారు. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వీక్ అవుతోంది.. బీహార్ రాష్ట్రంలో ఎందుకు ఓడిపోయింది.. వరుసగా ఓటములే ఎదురవుతున్నప్పటికీ ఎందుకు మారడం లేదు.. దశ దిశ లేకుండా పార్టీ అధిష్టానం ఎందుకు వెళ్తోంది.. వీటిపై రాధాకృష్ణ మొహమాటం లేకుండా రాసుకొచ్చారు. ఐనా ఇలాంటి విశ్లేషణలు ఎన్ని చేసినా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ మారదు.. మారే అవకాశం కూడా కనిపించడం లేదు. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులే నరేంద్ర మోడీకి వరాలవుతున్నాయి.