Revanth Reddy comments on TDP: రాజకీయాలలో ఏ నాయకుడు కూడా ఒకే పార్టీలో స్థిరంగా ఉండడు. కొంతమంది నాయకులు మాత్రం పార్టీలు మారుతూ ఉంటారు. మారుతున్న క్రమంలో గతంలో తమ పని చేస్తున్న పార్టీపై, అధినాయకత్వంపై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి మాత్రం పూర్తి డిఫరెంట్. ఆయన టిడిపిలో కీలక నాయకుడిగా ఎదిగారు. దాని కంటే ముందు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. ఆ పార్టీలో కొంతకాలం ఉండి.. ఆ తర్వాత టిడిపిలో చేరారు. టిడిపిలో ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభలో తనదైన వాణి వినిపించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నప్పుడు టిడిపి మీద ఒక్క విమర్శ కూడా చేయలేదు. చంద్రబాబు మీద ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. అంతకు ముందు పని చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై కూడా ఒక్క విమర్శ చేయలేదు. కెసిఆర్ ను మాత్రం విమర్శిస్తూనే ఉన్నారు. కెసిఆర్ వల్లే రేవంత్ రాజకీయ భవితవ్యం ఇబ్బందుల్లో పడడం వల్లే ఆయన ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు.
ఇక ఆదివారం ఖమ్మంలో రేవంత్ రెడ్డి పర్యటించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ” తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండకూడదని కెసిఆర్ కక్ష కట్టారు. ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీశారు. అటువంటి కెసిఆర్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలని” రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు . ఖమ్మం నగర పాలక సంస్థకు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఖమ్మం నగరంలో టిడిపికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. టిడిపి నాయకులు ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వారు ఓటు వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించిన సంస్థ గత ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ కు పడేవిధంగా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. అందువల్లే ఖమ్మం నగరంలో జరిగిన సమావేశంలో టిడిపి కార్యకర్తలు ఉత్తేజితులయ్యే విధంగా మాట్లాడారు.
ఇటీవల జూబ్లీ హిల్స్ నియోజవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఇదేవిధంగా మాట్లాడారు. దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఫలితంగా టిడిపి ఓటు బ్యాంకు మొత్తాన్ని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఆ క్రతువులో రేవంత్ రెడ్డి విజయవంతమయ్యారు. ఇక ఖమ్మంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి టిడిపికి అనుకూలంగా మాట్లాడారు. తద్వారా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టారు. మరోవైపు, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను గులాబీ పార్టీ నాయకులు మరో విధంగా ప్రచారంలోకి తీసుకుపోవడంతో.. సహజంగానే ఖమ్మం నగరంలోనే కాకుండా, మిగతా ప్రాంతాలలో కూడా టిడిపి నాయకులు గులాబీ పార్టీ నాయకుల మీద ఆగ్రహంగా ఉన్నారు. రేవంత్ పాచిక వల్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాని దెబ్బతీసిన కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/HqmwbBOJQQ
— Telugu Scribe (@TeluguScribe) January 18, 2026
