Revanth vs KTR: తెలంగాణ రాజకీయాలు క్రమేపి మారిపోతున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికీ.. సమీపంలో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు అంతకంతకు భగ్గు మంటున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి.. నేతలు ఒకరిని మించి ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రోజుకో తీరుగా పరిణామాలు మారుతున్నాయి.. ఇక ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బనకచర్ల ఎత్తిపోతల పథకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాన్ని కెసిఆర్ హయాంలోని మొదలుపెట్టిందని.. నాడు కెసిఆర్ ఈ పథకానికి ఆమోదం తెలిపారని.. తమ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నామని రేవంత్ ప్రకటించారు. ఈ విషయంపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు.
రేవంత్ విసిరిన సవాల్ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.. ఇప్పటికే విలేకరుల సమావేశం నిర్వహించడానికి ఐదువేల ఫీజు చెల్లించారు మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. ఇదే విషయాన్ని గులాబీ పార్టీకి అనుకూలంగా ఉండే సోషల్ మీడియా హ్యాండిల్ తన ఖాతాలో పోస్ట్ చేసింది. రేవంత్ విసిరిన సవాల్ కేటీఆర్ స్వీకరించారని.. ఆయన నేరుగా ప్రెస్ క్లబ్ వస్తున్నారని గులాబీ పార్టీ నాయకులు అంటున్నారు.. దమ్ముంటే ముఖ్యమంత్రి ప్రెస్ క్లబ్ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన విమానంలో హైదరాబాద్ వచ్చిన గంట సమయంలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటారని.. ఆయనకు దమ్ముంటే చర్చకు రావాలని గులాబీ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
Also Read: బాలకృష్ణ,వెంకటేష్ భారీ మల్టీస్టార్రర్ ఫిక్స్..డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తగిన విధంగానే స్పందిస్తున్నారు. రేవంత్ సవాల్ విసిరింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. కేటీఆర్ కు కాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారని చెబుతున్నారు. ఒకవేళ భారత రాష్ట్ర సమితి పార్టీకి అధ్యక్షుడు కేటీఆర్ అయితే.. ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే అయితే.. అధికారికంగా ప్రకటించుకుని ప్రెస్ క్లబ్ వద్దకు రావాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ” ముఖ్యమంత్రి సవాల్ చేసింది నేరుగా కెసిఆర్ కు. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి.. అన్ని పనులు ఆయన ఆమోదంతోనే జరిగాయి కాబట్టి.. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే సవాల్ కు రావాలని సూచిస్తున్నారు. అంతేతప్ప కేటీఆర్ ని రమ్మని కాదు. ఒకవేళ కేటీఆర్ కు అంత సరదాగా ఉంటే.. ప్రతిపక్ష నాయకుడిగా అధికారికంగా గులాబీ పార్టీ ఆయనను ప్రకటించాలి. అప్పుడు ఆయన సవాల్ కు రావాలి. అంతే తప్ప ఇలా వాళ్ళ వర్గం మీడియాలో హైలెట్ కావడానికి ప్రయత్నాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని” కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరోవైపు కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. గులాబీ పార్టీ కార్యకర్తలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.