CM Revanth Reddy: ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే కొన్ని పథకాలను అమలు చేస్తోంది. అందులో కీలకమైనది మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా కల్పించే ప్రయాణ సౌకర్యం. దీనికి మహాలక్ష్మి అని పేరు పెట్టింది. ఈ పథకాన్ని ప్రారంభించే సమయంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందన్నారు. ఉచిత ప్రయాణం వల్ల మహిళలు గొప్ప అనుభూతిని పొందుతారని పేర్కొన్నారు. అయితే ఈ పథకంపై గులాబీ అనుకూల మీడియా నెగిటివ్ ప్రచారం చేస్తోంది. భారత రాష్ట్ర సమితి నాయకులు ఆటో డ్రైవర్లతో కలిసి సమ్మెలు నిర్వహిస్తున్నారు. మహాలక్ష్మి పథకం వల్ల తమ నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల యూనియన్లతో చర్చలు జరిపింది. ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కో ఏడాది 12,000 ఇస్తామని ప్రకటించింది.
తాజాగా..
ఆటో డ్రైవర్ల సమస్య పరిష్కారమైన తర్వాత.. మహిళల కోణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇటీవల దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించే విషయానికి సంబంధించి చర్చించారు. దీనిపై ఆలోచన చేయాలని ఆయనకు విన్నవించారు. దీనివల్ల మహిళలకు ఆర్టీసీలో సమాన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభాకర్ తో భేటీ ముగిసిన అనంతరం ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమించుకునే విషయాన్ని పరిశీలిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఆయన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు వివరించారు.
అదే జరిగితే ఒక చరిత్రే
రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఆర్టీసీలో మహిళలను డ్రైవర్లుగా నియమిస్తే అది ఒక చరిత్రే అవుతుంది. మహిళా దినోత్సవం రోజు దీనికి సంబంధించి చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ల్లో ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థల్లో మహిళలు డ్రైవర్ లు పనిచేస్తున్నారు. ఉత్తర భారత దేశంలో లారీలు, ఇతర భారీ వాహనాలను మహిళలే నడుపుతున్నారు. కానీ మన రాష్ట్రంలో మహిళలు ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లుగా లేరు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆలోచనను అమలు చేస్తే గేమ్ చేంజర్ అవుతుంది. రేవంత్ కోరుకున్నట్టు మహిళా సాధికారత సాధ్యమవుతుంది. గతంలో మహారాష్ట్రలో మహిళా డ్రైవర్లకు ఏడాది పాటు శిక్షణ ఇచ్చారు. అందులో ఒక మహిళ తన బ్యాంక్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి డ్రైవర్ గా చేరడం విశేషం.