CM Revanth Reddy :ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో భేటీ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వారు విదేశాలలో తలదాచుకుంటున్నారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కు సంబంధించి విదేశాలలో తల దాచుకున్న వారిని స్వదేశానికి రప్పించే దిశగా రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. ఇక ఇటీవల ఓ సమావేశంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసు పై ప్రధానంగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన దాక్కున్నా వెతికి మరీ తీసుకొస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులపై ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని ఆ మధ్యన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందే. అది జరగాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది..
Also Read : KCR: అసెంబ్లీకి రాని కెసిఆర్ కు జీతం ఎందుకు..
దానికి చెక్ పెట్టెందుకే..
ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కార్నర్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబడుతోంది. కేటీఆర్, హరీష్ రావు, కవిత సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. ఆరు హామీలకు కాంగ్రెస్ పార్టీ మంగళం పాడిందని మండిపడుతున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి చేస్తున్న ఆరోపణలకు సరైన కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ స్థాయిలో సత్తా చాట లేకపోతున్నారు. ఈ క్రమంలో రెచ్చిపోతున్న భారత రాష్ట్ర సమితికి చెక్ పెట్టాలంటే బలమైన అ
అస్త్రాన్ని ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసును మరోసారి తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అనుమతితో.. విదేశాలలో తలదాచుకున్న ఫోన్ ట్యాపింగ్ నిందితులను స్వదేశానికి తీసుకొచ్చి.. కేంద్ర దర్యాప్తు సంస్థల అనుమతితో విచారిస్తారని సమాచారం. అయితే ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారులు బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ వారికి మంజూరు చేసింది. మరి దీనిపై రేవంత్ రెడ్డి వేసే అడుగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూర్చుతాయా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను
ఇరకాటంలో పెడతాయా.. అనే ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లో సమాధానం లభించనుంది. అన్నట్టు ఈసారి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలను కలవరని తెలియడంతో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది. రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి దూరం పెరిగిపోయిందని.. రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన వారికి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వకపోవడం ఇందుకు బలమైన ఉదాహరణ అని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోంది.