Revanth Reddy Phone Tapping: అడవిలో గజరాజుకు అన్నీ జంతువులు భయపడతాయి. చివరికి సింహం కూడా గజరాజును చూసి వణికి పోతుంది. గజరాజు వస్తుంటే ఎదురు వెళ్లే సాహసం కూడా చేయదు. అయితే అంతటి గజరాజు తన నెత్తి మీద తానే మన్ను పోసుకుంటుంది. ఇతర జంతువుల ప్రమేయం ఇందులో ఏమాత్రం ఉండదు. ఎందుకంటే దాని తొండం కొన్నిసార్లు విచక్షణ కోల్పోతుంది. అందువల్లే దుమ్ము ధూళి దాని నెత్తిమీద పడుతుంది. గజరాజు ప్రస్తావన ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చామంటే.. ఈ కథనం చదివేయండి మీకు అర్థమవుతుంది.
Also Read: తెలంగాణ లీడర్లు హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. పవన్ ప్రశ్న
పై ఉపోద్ఘాతంలో గజరాజు ప్రస్తావన గురించి తీసుకొచ్చాం కదా.. తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుతం ఆ స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ కొనసాగుతున్నారు. బలమైన కేసీఆర్ ను , ఆయన వ్యవస్థలను దెబ్బ కొట్టి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. అసలు ఏమాత్రం ఆశలు లేని కాంగ్రెస్ పార్టీకి సంజీవని అందించారు. దక్షిణాది రాష్ట్రంలో కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారాన్ని అందించి ఆ పార్టీకి కూడా పునర్జన్మ ప్రసాదించారు. అటువంటి ఘనత ఉన్న రేవంత్ సోమవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఒక మాట ఒక్కసారిగా జాతీయస్థాయిలో చర్చకు దారి తీస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి చేసుకున్న సెల్ఫ్ గోల్ ఆయనను ఇబ్బందులకు గురిచేస్తోంది. పేరు రాయడానికి ఇష్టపడని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని అంతరంగీకంగా అంగీకరిస్తున్నారు..
భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణాలు ఒకటి ఫోన్ ట్యాపింగ్. ఇన్ని రోజులపాటు ఈ వ్యవహారం మీదనే తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరిగింది. ఒకానొక దశలో ఈ వ్యవహారం మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో జరిగిందని కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆరోపించింది. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును విచారిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావును.. మిగతా పోలీస్ అధికారులను విచారించింది.. పోలీసులు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా విచారణకు హాజరయ్యారు.. మరి కొద్ది రోజుల్లో ఈ వ్యవహారంలో అసలు దోషులు బయటపడతారు అనుకుంటుండగా ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా బూమారాంగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని, నిర్దిష్ట పరిమితులు, పద్ధతుల్లో ప్రభుత్వాలు చేస్తాయని రేవంత్ వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తున్నది.
ఇదే అంశంపై భారత రాష్ట్ర సమితి చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాంటిది ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ సమర్ధించుకోవడం భారత రాష్ట్రపతికి ఆయాచిత వరంలాగా మారిపోయింది. ఇటీవల భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పై సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రుల ఫోన్ కాల్స్ వింటున్నారని ఆయన విమర్శించారు. కేటీఆర్ ఆరోపణలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ను మొన్న దాకా తప్పు పట్టిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.. మరి దీనిపై రేవంత్ ఎలాంటి వివరణ ఇస్తారు? భారత రాష్ట్ర సమితి చేసే విమర్శలకు ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సిన ఉంది.
Also Read: ఢిల్లీకి చేరిన బండి-ఈటల పంచాయతీ
ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి నాయకులు రెచ్చిపోతున్నారు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభుత్వ పరంగానే జరిగిపోయిందని.. అందులో కల్వకుంట్ల తారక రామారావు ఎటువంటి పాత్రలేదని చెప్పడం మొదలుపెట్టింది. అనవసరంగా కల్వకుంట్ల తారక రామారావును ఇబ్బంది పెట్టారని.. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోవాలని వారు సూచిస్తున్నారు. భారత రాష్ట్రపతి సోషల్ మీడియా అయితే మరింత రెచ్చిపోతుంది. ముఖ్యమంత్రి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.