Revanth Reddy Meet Rahul Gandhi: మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా సులభంగా మారిపోతుంటాయి. అప్పటిదాకా పార్టీ జెండా మోసిన వాళ్లు.. పార్టీ గద్దె కట్టినవాళ్లు.. కేసులు ఎదుర్కొన్న వాళ్ళు పక్కకు వెళ్లి పోతారు. మధ్యలో వచ్చినవాళ్లు.. లాబీయింగ్ చేసినవాళ్లు.. పార్టీ పెద్దల అవసరాలు తీర్చిన వాళ్ళు ఒక్కసారిగా మందు వరుసలోకి వస్తారు. ఇదేదో మేము చేస్తున్న ఆరోపణ కాదు. ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని.. ఆ పార్టీలో పని చేస్తున్న సీనియర్ నాయకులు అంటున్న మాట. సరే ఇప్పుడు రాజకీయాలు అనేవి పూర్తిగా డబ్బుమయం అయిపోయాయి. పార్టీ పెద్దల అవసరాలు తీర్చిన వాళ్లకే పీఠాలు దక్కుతున్నాయి. కాంగ్రెస్ మాత్రమే కాదు, అన్ని పార్టీలలో పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. ఇక ప్రాంతీయ పార్టీలో అయితే ఆ లెక్కలు వేరే విధంగా ఉంటాయి.
తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేవంత్ ముఖ్యమంత్రి అ కొనసాగుతున్నారు. అధిష్టానం పెట్టిన అనేక శల్య పరీక్షలు దాటుకుని ఆయన ఇక్కడదాకా వచ్చారు. ఇప్పుడిప్పుడే పరిపాలన మీద తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో కొన్ని వైఫల్యాలు ఉండవచ్చు.. కొన్ని సానుకూలతలు ఉండవచ్చు. కాకపోతే మీడియా కావాల్సింది వైఫల్యాలు మాత్రమే. ఎందుకంటే మీడియా అనేది పాజిటివిటీకి దూరంగా ఉంటుంది. మీడియా లక్షణం కూడా అదే.. ఇక ప్రస్తుతం రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీ వెళ్లడం ఇది 49వ సారి. ఆయన ఒక ముఖ్యమంత్రి కాబట్టి.. కేంద్రంతో సంప్రదింపులు ఉంటాయి కాబట్టి వెళ్తున్నారు. అందులో తప్పు పట్టడానికి లేదు. తప్పు అని చెప్పడానికి లేదు. ఆయనేం గులాబీ దళపతి కాదు కదా.. పైగా తను డెమొక్రటిక్ అని చెబుతున్నాడు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రికి అది తప్పదు.
Also Read: పవన్ కళ్యాణ్ కౌంటర్ కేటీఆర్ కేనా?
ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రేవంత్ కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నప్పటికీ.. ఎందుకో రాహుల్ ఈ మధ్య రేవంత్ మీద అలక పూనినట్టు కనిపిస్తున్నాడు. ఎలాగూ గులాబీ పార్టీ మీడియా.. ఆ పార్టీ నాయకులు ఈ వ్యవహారాన్ని నెగిటివ్ గానే చూస్తారు. అవకాశం దొరికింది కాబట్టి ఇంకా పెట్రోల్ పోస్తారు. ఆ మంటల్లో రాజకీయాలను చేస్తుంటారు. పైగా అధికారం పోయిన తర్వాత గులాబీ పార్టీ అత్యంత ప్రజాస్వామిక లక్షణాలను పుణికి పుచ్చుకుంటున్నది. అందువల్లే తెలంగాణ ముఖ్యమంత్రి తీరు నియంతలాగా ఉందని చెబుతోంది.. పాపం అధికారంలో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి ఎలా పరిపాలించిందో తెలంగాణ ప్రజలకు తెలియదా. అందు గురించే కదా పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఫలితాలు ఇచ్చింది. అయినా కూడా భారత రాష్ట్ర సమితి గొప్పలు చెప్పుకుంటుంది. త మీద తెలంగాణ మొత్తాన్ని బాగు చేసినట్టు డాంబికాలు పలుకుతోంది. ఇక హస్తినలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రికి చాలా కాలం తర్వాత రాహుల్ మోక్షం కల్పించారు. ఒక సీట్లో తను కూర్చుని.. మరో సీట్లో మల్లికార్జున కార్గే.. ఇంకో సీట్లో రేవంత్.. ఎదురుగా ఉన్న సీట్లో భట్టి కూర్చున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాలపై చర్చించారు.. కులగణన.. ఇతర అంశాలపై మాట్లాడారు.. ఇంకా అంతర్గత విషయాలు ఏం చర్చించారో తెలియదు. ఏ అంశాలు చర్చకు వచ్చాయో తెలియదు. మొత్తానికి ఈ ఫోటో ద్వారా రేవంత్ తన మీద వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు. తన మీద ఉన్న ఒత్తిడిని ఒక్కసారిగా తగ్గించుకున్నారు. తద్వారా రాహుల్ తనకు దూరం కాదని.. తానేమి రాహుల్ ను కాదని పోవడం లేదని రేవంత్ నిరూపించారు. రాహుల్ కూడా రేవంత్ తో సరదాగా మాట్లాడారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.