Revanth Reddy vs KTR : హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో జరుగుతున్న ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం కూడా నిర్వహించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే కేటీఆర్ వరకు అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. పోటాపోటీగా విమర్శలు చేసుకున్నారు. ఒకరు తక్కువ.. మరొకరు ఎక్కువ అన్నట్టు కాకుండా ఎవరి స్థాయిలో వారు తిట్లు తిట్టుకున్నారు. ఒకరి వ్యవహారాలను మరొకరు బయటపెట్టుకున్నారు. ఈ నియోజకవర్గ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గులాబీ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, కేంద్రమంత్రి బండి సంజయ్, వంటివారు వ్యక్తిగత విషయాలను కూడా వదలకుండా విమర్శలు చేసుకోవడం విశేషం.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉప ఎన్నిక మంగళవారం జరుగుతున్న నేపథ్యంలో.. మీట్ దీ ప్రెస్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కీలకమైన విషయాలను వెల్లడించారు. ” పాలేరు నియోజకవర్గం లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే.. ఆయన భార్య సుచరిత ఎన్నికలు నిలబడితే.. పట్టుబట్టి ఓడించారు. ఈ విష సంస్కృతికి తెర లేపింది కేసీఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పీజేఆర్ చనిపోతే.. యునానిమస్ గా ఆయనకు మద్దతు ప్రకటించారు నాటి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు. కానీ ఈ విషయంలో కెసిఆర్ సహకరించలేదు. పైగా ఆయన కోసం పీజేఆర్ కుటుంబ సభ్యులు పెడితే మూడు గంటలసేపు వెయిట్ చేయించారు.. ఆ తర్వాత పోటీ ఉంటుందని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని నిలబెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలేరు, నారాయణఖేడ్ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే యునాని మస్ గా కాకుండా అభ్యర్థులను పోటీలో దింపి కేసిఆర్ విష సంస్కృతికి తెర లేపారు. ఇప్పుడు ఆయన నేర్పిన సంస్కృతినే మేం కొనసాగించాల్సి వస్తోంది. ఆ సంస్కృతి ఆయనను దెబ్బ కొడుతోందని” రేవంత్ పేర్కొన్నారు
పెద్ద తేడా లేదు
” పుష్ప సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ అందరికీ గుర్తే ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ కు కేటీఆర్ ప్రచారానికి పెద్ద తేడా లేదు.. కేటీఆర్ ప్రచారంలో పార్టీ జెండాను, పార్టీ కండువాను ఎలా ఊపారో మీరు చూశారు కదా.. ఒకప్పుడు మాదక ద్రవ్యాలు ఎక్కడో ఉండేవి. ఇప్పుడు మన చుట్టూ అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాటిని వాడుతున్న మనుషులు కనిపిస్తున్నారు. ఇటువంటి విధానాన్ని తీసుకొచ్చింది ఎవరు? సినీ కార్మికులతో మాట్లాడుతున్నది ఎవరు.. సినీ తారలతో గెస్ట్ హౌస్లలో చర్చలు సాగిస్తున్నది ఎవరు.. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలని” రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పలు పర్యాయాలు రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. అంతేకాకుండా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ కు శ్రీ లీల ఐటమ్ సాంగ్ కు మూడు పెట్టి సరికొత్తస్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి.