CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నిక రేసులో ముందు వరుసలో నిలిచేందుకు తెలంగాణలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు, మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కూడా పోటీ పడుతున్నాయి. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అన్ని స్థానాలకు టికెట్లు ప్రకటించి బీజేపీన బీజేపీ ప్రచారంలోనూ దూసుకుపోతోంది. ఇక 16 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన బీఆర్‌ఎస్ ప్రచారంలో మాత్రం వెనుకబడింది. అభ్యర్థులకు, క్యాడర్‌కు మధ్య సమన్వయం కుదరడం లేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ చేయలని, కనీసం 14 లోక్‌సభ స్థానాలు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న అధికార కాంగ్రెస్ మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయిలో టికెట్లు ఖరారు చేయలేదు. మొత్తం 17 స్థానాలకు ఇప్పటి వరకు 14 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
ఢిల్లీ వెళ్లిన సీఎం..
గత కొన్ని రోజులుగా మూడు స్థానాలపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి తెర దించేందుకు సీఎం రేవంత్ గురువారం ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటనలో మిగిలిన మూడు స్థానాలపై క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పర్యటనలో అధిష్టానం పెద్దలతో రేవంత్ చర్చించి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విషయంలో పెద్దగా కసరత్తు చేయడం లేదు. వీలైతే ఇక్కడ ఎంఐఎంకు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉంది. కరీంనగర్, ఖమ్మం సీట్లపైనే కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిపెట్టింది.
ఖమ్మం, కరీంనగర్‌లో పోటీ..
ఖమ్మం, కరీంనగర్ టికెట్ కోసం ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు పోటీ పడుతున్నారు. ఖమ‍్మం టికెట్‌ను తన భార్యకు ఇప్పించుకునేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రయత్నిస్తుండగా, తన తమ్ముడికి ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేని పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా వెలమ సామాజిక వర్గానికి టికెట్ ఇప్పించుకునేందుకు మండవ వెంకటేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చారు. ఇక కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే తనయుడు వెలిచాల రాజేందర్‌రావు పోటీ పడుతున్నారు. వీరితోపాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్) పేరును రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. రెండు నియోజకవర్గాలకు ముగ్గురు చొప్పున పోటీ పడుతుండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలో అధిష్టానం తేల్చుకోలేకపోతోంది.
ఫైనల్ చేసే ఛాన్స్..
ఏప్రిల్ 18న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేష్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన మూడు స్థానాలపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సీఎం పర్యటన తర్వాత మూడు స్థానాలకు టికెట్లు ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఇప్పుడే ప్రకటించకపోవచ్చని అంటున్నారు. మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలో దించే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.