https://oktelugu.com/

Revanth Reddy: కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్..రేవంత్ రెడ్డివి వల్లమాలిన ఆశలేనా..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ కు గనుక సుమారు 125 సీట్లు వస్తే..ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు ఏ మేరకు ఆ పార్టీకి మద్దతిస్తాయని అంశంపై రకరకాల చర్చలు ఉన్నాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 21, 2024 / 02:09 PM IST

    Revanth Reddy confident of Congress win in Central

    Follow us on

    Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి సింగిల్ గా 125 సీట్లు వచ్చినా.. చాలంటున్నారు. 125 సీట్లతోనైన కేంద్రంలో కాంగ్రెస్ తన మిత్ర పక్షాలతో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు..కాంగ్రెస్ సానుభూతిపరులకు రుచించినా.. వాస్తవం అలా ఉండే పరిస్థితులే ఉండవంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇండియా కూటమిలో చాలానే ప్రాంతీయ పార్టీలున్నాయి. కాకలు తీరిన ప్రాంతీయ పార్టీల నేతలందరూ..ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి నడిచారు.

    అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ కు గనుక సుమారు 125 సీట్లు వస్తే..ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు ఏ మేరకు ఆ పార్టీకి మద్దతిస్తాయని అంశంపై రకరకాల చర్చలు ఉన్నాయి. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ఈసారి బిజెపికి గట్టి పోటీనే ఇస్తున్నారు. టిఎంసి ఎంత కాదనుకున్నా..వెస్ట్ బెంగాల్లో చెప్పుకోదగ్గ లోక్సభ స్థానాలనైతే గెలుచుకోగలదు. అయితే కాంగ్రెస్ కనుక 125.. లేదా కాస్తా అటు ఇటు సీట్లు వచ్చినప్పటికీ..ఈమె మాత్రం ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఛాన్సెస్ అంతంతేననే అభిప్రాయం ఉంది. బెంగాల్లో బిజెపి ప్రాబల్యాన్ని తగ్గించాలని మమత ఎప్పటి నుంచో చూస్తుంది. అందువల్ల ఈసారి ఎన్నికల్లో బిజెపి మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే..టిఎంసి ఆ పార్టీతో జతకట్టే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బిజెపితో టీఎంసీ జత కడితే బెంగాల్లో ఆటోమేటిక్ గా భాజపా ప్రభావం తగ్గే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీదీ అవసరమైతే వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత బిజెపితో కూడా వెళ్ళొచ్చంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

    మరోవైపు బిజెడి,ఎన్సీపి పార్టీలు కూడా ఇదే ఫార్మూలను అనుసరించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి 125 సీట్లు వచ్చినా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు సన్నగిల్లుతాయి. బిజెపి మాత్రం 220 స్థానాలను సాధించి సర్కార్ ను ఏర్పాటు చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతేకాక వైసిపి వంటి పార్టీలు కాంగ్రెస్ కు అసలు మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలీయంగా లేనప్పుడు..బలమైన బిజెపికి మ్యాజిక్ ఫిగర్ సీట్లు రానప్పటికీ.. భాజపాకే మద్దతివ్వడం ఉత్తమమనే ఒపీనియన్ లో జగన్ ఉండొచ్చని చెప్తున్నారు విశ్లేషకులు. ఏ రకంగా చూసినా.. రేవంత్ చెప్పినట్లు 125 సీట్లు వచ్చినా.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు అసలే కనిపించడం లేదు.