Revanth Reddy Chiranjeevi: ఓహో చిరంజీవి ఇల్లు అక్కడ ఉంది కాబట్టి.. జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ను ఆయన డిసైడ్ చేయాలా?
మీడియాకు ఇన్సైడ్ సమాచారం తెలిసినప్పుడు.. ఆ సమాచారాన్ని ప్రజలు అర్థం చేసుకునే విధంగా..ఓహో కూడా జరుగుతుందా అనుకునే విధంగా వార్తను ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసేటప్పుడు తర్కాన్ని వదలకూడదు. వాస్తవాన్ని విస్మరించకూడదు. అలాకాకుండా బోడిగుండుకు, మోకాలికి లింకు పెడితేనే అసలు సమస్య.. పైగా అటువంటి వాటి వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తుంటాయి.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక రానుంది. జూబ్లీహిల్స్ శాసనసభ సభ్యుడు మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూయడంతో.. ఆ శాసనసభ స్థానంలో ఉప ఎన్నిక రానుంది. ఈ ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో తమపై ఆగ్రహం లేదని చెప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇదే నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుత ప్రభుత్వానికి రెఫ రెండమని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు.
Also Read: కవిత vs జగదీశ్వర్ రెడ్డి.. ఫామ్ హౌస్ లో కెసిఆర్ కీలక సమావేశం.. గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది?
ఈ ఉప ఎన్నిక గురించి చర్చ ఇలా సాగుతుండగానే.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు చిరంజీవి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు. వీరిద్దరి కలయిక ఒకరకంగా చర్చకు దారితీసింది. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద తలకాయ మాదిరిగా చిరంజీవి వ్యవహరిస్తున్నారు. చిత్రపరిశ్రమలో సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా ముందడుగు వేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలు వేతనాలు పెంచాలని వివిధ విభాగాలలో పనిచేసే వారు సమ్మెకు దిగుతున్నారు. ఇవే కాకుండా ఇంకా కొన్ని సమస్యలు చిత్ర పరిశ్రమలో ఉన్నాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వాన్ని కలిశారు చిరంజీవి. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఇంకా ఎటువంటి చర్చలు జరిగాయో తెలియదు. కాకపోతే కొన్ని మీడియా సంస్థలు వారిద్దరి మధ్య సీక్రెట్ కెమెరాలు పెట్టినట్టు.. వారిద్దరూ మాట్లాడుకుంటే వింటున్నట్టు.. ఏవేవో ఊహగానాలు రాసుకుంటూ వెళ్ళాయి. అవన్నీ నిజమని.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలిపితే బాగుంటుందో చిరంజీవి చెప్పారని.. చిరంజీవి చెప్పిన మాటలను రేవంత్ విన్నారని.. పైగా జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసం ఉంది కాబట్టి.. ఆయన గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని.. ఇదిగో ఇలా రాసుకుంటూ పోయాయి కొన్ని మీడియా సంస్థలు. నిజానికి జూబ్లీహిల్స్ లో చిరంజీవి నివాసం ఉంటే.. ఆయన గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారా.. తాను రాజకీయాల్లో లేనని.. రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి ఏనాడో చెప్పారు. అలాంటప్పుడు మళ్లీ చిరంజీవిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకు.. ఆయన డిసైడ్ చేసిన వ్యక్తులే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారని చెప్పడం ఎందుకు.. పాపం సోషల్ మీడియా దెబ్బకు ప్రధాన మీడియా లో పనిచేసే వాళ్ళ చిప్ లు దొబ్బినట్టున్నాయి..