Raja Singh Resigns: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావును పార్టీ అధిష్టానం నియమించింది. ఇంకా దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీలో ముసలం పుట్టింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తన అసమతి స్వరాన్ని వినిపించారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచంద్రరావుని అధికారికంగా ప్రకటించక ముందే సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక.. అసమ్మతి రాజేసిన రాజాసింగ్
గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించడానికి ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. అధిష్టానం వైఖరి సరిగ్గా లేదని అందువల్లే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన గంటల వ్యవధిలోనే రాజాసింగ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించడం విశేషం. రాజా సింగ్ కు రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారని సమాచారం ముందే తెలియడంతో ఆయన ఆదివారమే కీలక వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో పట్టు లేని వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే ఉపయోగం ఏమిటని ఆయన ప్రశ్నించారు.. అధిష్టానం తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్లే ప్రభుత్వం ఏర్పాటు చేసే బలాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో సాధించలేకపోతుందని రాజాసింగ్ మండిపడ్డారు.
ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ అధిష్టానం పై రాజాసింగ్ తనదైన స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు అవకాశం దొరికితే చాలు ఆరోపణలు చేస్తున్నారు ఏమాత్రం మొహమాటం లేకుండా తెర వెనుక జరుగుతున్న విషయాలను కూడా ఆయన ఓపెన్ గానే చెప్పేస్తున్నారు దీంతో అధిష్టానం ఇటీవల కాలం నుంచి ఆయనపై ఆగ్రహంగా ఉంది ఇప్పటికే ఆయనకు పలుమార్లు అధిష్టానం అవకాశాలు ఇచ్చింది ఆయన ఎప్పటికీ ఆయన తన ధోరణి మార్చుకోకపోవడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగింది.
ఇక రాజా సింగ్ ను బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవికి పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి రాజాసింగ్ తన రాజీనామా లేఖను పంపించారు. అధిష్టానం వైఖరి సరిగ్గా లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజా సింగ్ వెల్లడించారు. అధ్యక్ష పదవికి తనను పరిగణలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. రాజా సింగ్ రాజీనామా లేఖను కిషన్ రెడ్డి ఆమోదిస్తారా? లేక అధిష్టానం నిర్ణయానికి వదిలేస్తారా? అనేది చూడాల్సి ఉంది. గోషామహల్ అసెంబ్లీ స్థానంలో రాజా సింగ్ అనేకమార్లు పోటీ చేశారు. పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ రాజాసింగ్ విజయం సాధించారు.
భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుపొందిన రాజాసింగ్ ఇలాంటి నిర్ణయం తీసుకోడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. పార్టీ ఎదుగుదలకు తీవ్రంగా కృషి చేసిన ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన రాజాసింగ్ హైదరాబాద్ లాంటి ఏరియాలో పార్టీ విశిష్టత కోసం కృషి చేశారని పేర్కొంటున్నారు. అటువంటి వ్యక్తి ఇలా రాజీనామా చేయడం ఇబ్బందికరంగా ఉందంటూ వారు పేర్కొంటున్నారు.