ఏ రాష్ట్రంలో చూసినా ప్రభుత్వ జాబ్స్‌తో పోల్చుకుంటే ప్రైవేటు ఉద్యోగాల సంఖ్య చాలా ఎక్కువ. ప్రభుత్వాలు సరైన ఉపాధి కల్పించకపోవడంతో నిరుద్యోగులు ప్రైవేటు వైపు వెళ్తున్నారు. కానీ.. ఈ కరోనా ప్రైవేట్ ఉద్యోగులను పెను సంక్షోభంలోకి నెట్టేసింది. కరోనా వచ్చాక లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. మరికొంత మంది పే లాస్‌కు పనిచేస్తున్నారు. దేశంలో ఏ క్షణాల లాక్‌డౌన్ మొదలైందో అప్పటి నుంచే ప్రైవేట్ సంస్థలు చేతులెత్తేశాయి.
Also Read: ఈఎంఐ, రుణాల మీద కేంద్రం, ఆర్బీఐ వైఖరేంటి?
ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఎదుట ఓ ప్రైవేటు ఉద్యోగి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కరోనా కారణంగా ప్రైవేటు ఉద్యోగం పోయిందని మనస్తాపం చెందిన ఒక వ్యక్తి పెట్రోల్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా మా బతుకులు మారలేదని.. బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘కేసీఆర్ సార్.. జై తెలంగాణ అంటూ’ నినాదాలు చేశాడు. తమను ఆదుకోవాలంటూ చేతులు జోడించి ప్రాదేయపడ్డాడు. తెలంగాణ వచ్చినా మా బతుకులు మారలేదని బాధితుడు కన్నీటి పర్యంతం అయ్యాడు.
అది ఈ ఒక్కడి బాధే కాదు.. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన వారిది.. పెద్ద స్థాయి ప్రైవేటు సంస్థలు కొన్ని అయితే ఎంప్లాయిస్‌ని తీసేసి.. వారికి ఎంతో సారీ చెప్పి ఎంతో కొంత సెటిల్ చేసి పంపించాయి. కొన్ని మధ్యతరగతి, చిన్న స్థాయి కంపెనీలైతే ఉద్యోగులకు కొన్ని రోజులు డ్యూటీలు కేటాయిస్తున్నాయి. ఆ పనిచేసిన రోజులకే సాలరీస్ ఇస్తున్నాయి. ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్న కంపెనీలైతే చాలా తక్కువనే చెప్పాలి. కరోనా క్రైసిస్‌తో చాలా వరకు కంపెనీల నుంచి ఉద్యోగులను పక్కన పెట్టేశాయి. ఇదిలా ఉంటే.. కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ కొనసాగాలంటే రానున్న కొన్ని నెలలు కావచ్చు లేదంటా ఏడాదైనా కావచ్చు. మార్కెట్ మాయలో పడి ఏ మాత్రం పొదుపు పాటించకుండా ఖర్చు చేసిన ఉద్యోగులే చాలా వరకు ఉండడంతో ఇప్పుడు వారంతా తలలు పట్టుకొని కూర్చున్నారు.
భవిష్యత్తును ఆలోచించి ఎంతోకొంత పొదుపు చేసిన వారిలో మాత్రం ఎప్పటికైనా ఉద్యోగం దొరకకపోతుందా అని ధీమా కనిపిస్తోంది. ఒక నాలుగైదు నెలలైనా ఉన్న డబ్బులతో కుటుంబాన్ని నడిపించొచ్చనే అభిప్రాయం వారి నుంచి వినిపిస్తోంది. ఇక ఏమీ పొదుపు చేయలేని వారిలో మాత్రం ఆ భయం మాత్రం మామూలుగా లేదు. కుటుంబ పోషణ, ఈఎంఐల పరిస్థితి ఏంటనే టెన్షన్‌లో ఉన్నారు.
Also Read: చైనాకు ఇక వణుకే.. భారత వైమానిక దళంలోకి రఫేల్ జెట్స్
లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్నా నెల చివరకు ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులను వాడే వారు ప్రైవేటు ఎంప్లాయిలలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొన్ని నెలలపాటు ఉద్యోగాలు లేకపోతే పెరిగే నిరుద్యోగం, తద్వార ఏర్పడే విపరీత పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్యోగవర్గం సంసిద్ధంగా ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎప్పుడైనా ప్రైవేటు రంగం తన సెల్ఫ్ అభివృద్ధిని మాత్రమే చూసుకుంటుంది. అది ప్రైవేటు సంస్థలకు పుట్టుక నుంచి తెలిసిన విద్యే. ఒకవేళ పరిస్థితులు చక్కబడి మళ్లీ కంపెనీలు రిక్రూట్‌మెంట్ ప్రాధాన్యం ఇచ్చినా మునుపటి సాలరీస్ ఇస్తాయన్న నమ్మకం అయితే లేదు. ఇప్పటికే ఎంత గానో కోల్పోయిన ప్రైవేట్ ఉద్యోగులు ఫ్యూచర్‌ను కూడా దృష్టిలో పెట్టుకొనే మలచుకుంటే మంచి జరుగుతుందనేది పలువురి సూచన.