Pravalika Case: ప్రభుత్వ కొలువు కోసం వివిధ పరీక్షలకు సిద్ధమవుత వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక ఆత్మహత్య ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రవళిక ఆత్మహత్య రాజకీయరంగు పులుముకుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ హత్యే అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ కొట్టిపారేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవళిక అసలు ఏ పరీక్ష రాయలేదని, విషయం తెలియకుండా విపక్షాలు చావును రాద్ధాంతం చేస్తున్నాయని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులు కూడా ప్రభుత్వం చెప్పినట్లే.. ప్రవళిక ప్రేమ వ్యవహారం కారణంగానే చనిపోయిందని ప్రకటించేశారు. కానీ, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను విపక్షాలు, నిరుద్యోగులు ఆధారాలతో సహా ఎండగడుతున్నారు. ప్రవళిక ఏయే పరీక్షలు రాసింది. దేని దేనికి దరఖాస్తు చేసింది… హాల్‌టికెట్లతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేసి కేటీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌కు అసలు విషయం అర్థమైంది. విషయం తెలుసుకోనిది విపక్షాలు కాదని కేటీఆరే అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతో సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
హడావుడిగా ప్రగతి భవన్‌కు…
సెల్ఫ్ గోల్‌తో ఇబ్బందుల్లో పడిన తెలంగాణ ముఖ్యమైన మంత్రి వెంటనే పొరపాటుకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో ప్రవళిక తల్లి విజయ, తమ్ముడు ప్రణయ్‌ను హడావుడిగా ప్రగతి భవన్‌కు పిలిపించారు. అక్కడ వారికి కొన్ని ప్రలోభాలు చూపినట్లు తెలస్తోంది. కొన్ని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. నయానో భయానో మోత్తానికి ఓ వీడియోను కూడా అక్కడే షూట్ చేయిచారు. అందులో రాజకీయాల కోసం తన కూతురు ఆత్మహత్యను వాడుకోవద్దని విజయ వేడుకుంది. ప్రణయ్ కూడా తన అక్క ఆత్మహత్యకు ప్రియుడే కారణమని పేర్కొన్నారు. ఈ వీడియోను మీడియాకు విడుదల చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే తప్పు దిద్దుకునే ప్రయత్నంలో కేటీఆర్ తప్పు మీద తప్పు చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ వీడియో పూర్తిగా భయపెట్టి ప్రలోభపెట్టి చేసిందే అని నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు.
వీడియోల్లో ఏముందంటే..
‘గవర్నమెంట్ జాబ్ కొడతా అని చెప్పింది. అన్ని పరీక్షలు రాసే వస్తానంది. గ్రూప్4 పరీక్షలు రాశాక ఫలితాలు ఎలా వస్తాయోనని మూడు రోజులు ఉపవాసం ఉంది నా బిడ్డ. అప్పుడు జ్వరం కూడా వచ్చింది. ఆ తరువాత ఊరికి వచ్చి హైదరాబాద్ పోతానంటే వద్దన్నాం. అయినా వినలేదు. గాంధీ ఆస్పత్రిలో పని చేస్తే 18 వేలు జీతం వస్తుందంట… అక్కడ ఉద్యోగం చేస్తూ చదువుకుంటా అని చెప్పి పోయింది. వాని నౌకరి పాడు పడ’ అని ప్రవళిక తల్లి తన మొదటి వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది.
‘మా అక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించటమే లక్ష్యంగా చదువుకుంది. గ్రూప్–2 పరీక్షలకు కష్టపడి సన్నద్ధమయ్యింది. అంతలోనే పరీక్షలు వాయిదా వేయటంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యింది. ఆ క్రమంలోనే ప్రాణాలు తీసుకుంది’ అని ప్రవళిక సోదరుడు ప్రణయ్ కూడా మొదట వెల్లడించాడు.
తాజా వీడియోలో..
‘నా బిడ్డను రెండేళ్లుగా అక్కడే (హైదరాబాద్‌లో) చదివించుకుంటున్న. శివరాం నా బిడ్డను వేధించాడు. దానిని భరించలేకనే నా బిడ్డ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీనికి కారణమైన శివరాంను కఠినంగా శిక్షించాలి. అతన్ని కూడా ఉరి తీయాలి. పార్టీల పరంగా ఉన్న గొడవల్లోకి మమ్మల్ని లాగకండి.’ అని తాజా వీడియోలో ప్రవళిక తల్లి విజయ వేడుకుంది.
‘మా అక్కను శివరాం తీవ్రమైన వేధింపులకు గురి చేశాడు. ఇష్టం లేకపోయినా ఫోన్లు చేసేవాడు. హాస్టల్వద్దకు వచ్చి అందరి ముందు ఇబ్బంది పెట్టేవాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తీవ్ర డిప్రెషన్‌కు గురై అక్క ఆత్మహత్య చేసుకుంది. శివరాంను ఉరి తీయాలి, లేదా ఎన్‌కౌంటర్ చేయాలి’ అని ప్రవళిక సోదరుడు ప్రణయ్ కూడా తాజా వీడియోలో కోరాడు.
ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తర్వాత..
ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న తర్వాత రెండు రోజుల వరకు ఆమె కుటుంబ సభ్యులు శివరాం రాథోడ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రవళిక రాసినట్టుగా చెబుతున్న సూసైడ్ నోట్‌లో కూడా అతడి పేరు లేదు. ప్రేమ వ్యవహారం గురించి కూడా ప్రవళిక పేర్కొనలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మూడు రోజుల్లోనే ప్రవళిక తల్లి, సోదరుడు మాట మార్చటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సూసైడ్ నోట్‌లో ఇలా..
‘నేను చాలా నష్ట జాతకురాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధ పడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టటం నా అదృష్టం అమ్మా. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేనేం చేయలేకపోతున్నా. ప్రణయ్…అమ్మానాన్న జాగ్రత్త’ అని మాత్రమే రాసి ఉంది.
ప్రగతిభవన్ నుంచి పిలుపు?
ప్రవళిక తల్లి విజయ, తమ్ముడు ప్రణయ్‌ను ప్రగతిభవన్‌కు తీసుకు రావాల్సిందిగా పోలీసులకు సూచనలు వెళ్లినట్టు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అవుతుండటం గమనార్హం. ఇక, మంగళవారం ఉదయం విజయ, ప్రణయ్లు తమ ఊరు బిక్కాజిపల్లి నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై గ్రామస్తులతో మాట్లాడగా ఆస్పత్రికి వెళుతున్నట్టు చెప్పారన్నారు. అయితే, పోలీసులే వారిని గ్రామం నుంచి తీసుకెళ్లి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి.