Gaddar : ప్రఖ్యాత జానపద కళాకారుడు.. “ప్రజల గాయకుడు” అని చాలా మంది పిలుచుకునే గద్దర్ శాశ్వతంగా కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.
తెలంగాణనే ఇంటి పేరుగా మలుచుకొని గద్దర్ తన శక్తివంతమైన పాటలతో స్ఫూర్తిదాయకమైన ఉద్యమాన్ని రగిలించారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన తన పాటలతో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ సమస్యల పరిష్కరించడంలో విశిష్ట పాత్ర పోషించారు. ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చారు.
1949లో మెదక్ జిల్లా తూప్రాన్‌లో గుమ్మడి విఠల్‌రావుగా జన్మించిన గద్దర్ 2010 వరకు నక్సలిజం ఉద్యమంలో కొనసాగారు. ఆ తర్వాత జనజీవన స్రవంతిలో చేరి.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రముఖుడిగా నిలిచారు.
ఆయన మరణించే ముందు, గద్దర్‌కు గుండె శస్త్రచికిత్స జరిగింది. దురదృష్టవశాత్తు ఇటీవల అనారోగ్యంతో ఆయన అపోలో ఆసుపత్రిలో చేరాడు, చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి మరణించారు. సామాజిక ఉద్యమాలపై ఆయన చేసిన పోరాటం.. ఆయన పాటల ప్రభావం చిరకాలం గుర్తుండిపోతాయి.
1989లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్ కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై హత్యాయత్నం కూడా జరిగింది. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాడిన ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ అంటూ గద్దర్ ఆలపించిన పాటలు తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చాయి.
నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు గద్దర్ కు నంది అవార్డు దక్కింది. అయితే ఆయన ప్రభుత్వాల ఎన్ కౌంటర్లకు నిరసనగా నంది అవార్డును తిరస్కరించి సంచలనం రేపారు. మొత్తంగా ఒక ఉద్యమ గాయకుడి మరణం తెలంగాణ సమాజాన్ని శోకసంద్రంలో ముంచింది.
