Voting rights in AP : అర్హులంతా ఓటు నమోదు చేసుకోండి అంటూ ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. కానీ సాక్షాత్ ఎన్నికల కమిషనర్ గా పని చేసిన వ్యక్తికి ఓటు కల్పించడంలో విఫలమైంది. వింతగా ఉంది కదూ. మీరు వింటున్నది నిజమే. 2020, 21 లో ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కు కి దరఖాస్తు చేసుకున్నా.. నమోదు చేయడంలో యంత్రాంగం తాత్సారం చేస్తోంది. దీంతో ఎన్నికల సంఘం మాజీ అధికారికి ఎదురుచూపులు తప్పడం లేదు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ది గుంటూరు జిల్లా దుగ్గిరాల. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో.. జగన్ సర్కార్కు సహకరించలేదన్న అపవాదు ఎదుర్కొన్న అధికారి. వైసీపీ సర్కార్ తో ఢీ కొట్టిన చరిత్ర ఆయనది. ఎన్నికల నిర్వహణలో తన మాట వినలేదన్న కోపంతో.. జగన్ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి రమేష్ కుమార్ ను తొలగించారు. కోర్టు జోక్యంతో రమేష్ కుమార్ ఆ పదవిని దక్కించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. పదవీ విరమణ పొందిన ఆయన స్వగ్రామం దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలల తరబడి ఎదురుచూస్తున్నారు కానీ.. ఓటు హక్కు మాత్రం దక్కలేదు.
2021 లో రమేష్ కుమార్ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ స్థానిక తహసిల్దార్, రెవెన్యూ అధికారులు కుంటి సాకులు చెప్పి ఓటు హక్కు కల్పించలేదు. దీంతో రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. 2023 జూలై 13వ తేదీన దుగ్గిరాలలో ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో శనివారం ఓట్ల పరిశీలనలో భాగంగా బి ఎల్ వో రమేష్ కుమార్ నివాసానికి వచ్చారు. ఆయన తల్లి ఓటును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటు నమోదుకు అవసరమైన అన్ని ఆధారాలను రమేష్ కుమార్ బి ఎల్ ఓ గోపికి అందించారు.
ఎన్నికల కమిషనర్ గా విధులు నిర్వహించిన తనకే ఓటు హక్కు రాకపోవడం బాధాకరమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యానించారు. తనకు దుగ్గిరాలలో సొంత ఇల్లు తో పాటు ఆస్తిపాస్తులు ఉన్నాయని.. తల్లితో కలిసి జీవనం సాగిస్తున్నానని.. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ స్పందించి ఓటు హక్కును కల్పించాలని రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.