Ponnam Prabhakar: ప్రజలు ఓడించారని పగనా.. దయ చూపు ‘పొన్నం’ సార్?

తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కసరత్తు చేస్తోంది. అనుమతి కోసం కేంద్రానికి ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసింది.

Written By: Raj Shekar, Updated On : October 27, 2024 2:35 pm

Ponnam Prabhakar

Follow us on

Ponnam Prabhakar: తెలంగాణలో కొత్త విమానాశ్రయాలకు పదేళ్ల క్రితమే కేంద్రం ప్రతిపాదన చేసింది. వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, భద్రాచంలో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సర్వే కూడా చేసింది. ఎయిర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఈమేరకు సర్వే చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చింది. అయితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కొత్త ఎయిర్‌ పోర్టుల ప్రతిపాదనలు అటకెక్కాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల ఏర్పాటు అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈమేరకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెకంటరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోమన్‌నాయుడుకు లేఖ కూడా రాశారు. ఢిల్లీలో కలిసి విన్నవించారు. వరంగల్, భద్రాచలంలో విమానాశ్రయాలు ఏర్పాటుకు చేయాలని కోరారు. అనుమతి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్‌ ఎయిర్‌పనోర్టు ఒక్కటే ఉందని తెలిపారు.

సైట్‌ క్లియరెన్స్‌..
ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఏనుమాములలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సైట్‌ క్లియరెన్స్‌ ఇచ్చింది. గతంలో ఇక్కడ ఎయిర్‌ పోర్టు ఉండడంతో తిరిగి దానిని పునరుద్ధరించడం సులభమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఏనుమాములలో ఏర్పాటుకు ముందుకు వచ్చింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారికంగా ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసుల కల నెరవేరబోతోందని తెలిపారు.

కరీంనగర్‌పై చిన్న చూపు..
ఇక పొన్నం ప్రభాకర్‌ యూపీఏ హయాంలో కరీంనగర్‌ ఎంపీగా పనిచేశారు. ఆయన హయాంలోనే కరీంనగర్‌కు తిరుపతి రైలు వచ్చింది. కరీంనగర్‌కు రేడియో స్టేషన్‌ మంజూరు చేయించారు. శాతవాహన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ఎన్‌ఎస్‌యూఐ స్థాయి నుంచి ఎంపీగా, ప్రస్తుతం మంత్రిగా ఎదిగిన పొన్న ప్రభాకర్‌ కరీనంగర్‌లో పుట్టి పెరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. బీసీ కోటాలో ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. కానీ, ఆయన కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరిస్తున్నట్లు స్థానికుల్లో అభిప్రాయం నెలకొంది. గతంలో ఎంపీగా కరీనంగర్‌ అభివృద్ధికి కృషి చేసిన పొన్నం ప్రభాకర్‌ ఇప్పుడు మంత్రిగా కరీంనగర్‌ గురించి పట్టించుకోవడం లేదన్న భావన కరీనగర్‌వాసుల్లో క్రమంగా పెరుగుతోంది.

స్మార్ట్‌ సిటీగా కరీంనగర్‌..
ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌ గత ప్రభుత్వ హయాంలో స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందింది. ఉమ్మడి కరీనంగర్‌ జిల్లాలో వేములవాడ, కొండగట్టు ఆలయాలు ఉన్నాయి. రాముగండం థర్మల్‌ పవర్‌ స్టేషన్, సింగరేణి బొగ్గు గనులు ఉన్నాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఎరువుల కర్మాగారం ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి నిత్యవ వందల మంది కరీంనగర్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. కానీ, కరీంనగర్‌కు ఎయిర్‌ పోర్టు మంజూరు కావడం లేదు. గతంలో బసంత్‌నగర్‌లో నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినా ఎన్టీపీసీ విద్యుత్‌ తీగలు దానికి ఆటంకంగా మారాయి. ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం వరంగల్‌కు ఎయిర్‌పోర్టు మంజూరైన నేపథ్యంలో ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా, పారిశ్రామికంగా ప్రత్యేకతలు ఉన్న కరీనంగర్‌కు ఎయిర్‌ పోర్టు మంజూరుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కృషి చేయాలని కోరుతున్నారు.

కీలక పదవుల్లో ఇద్దరు నేతలు..
ఉమ్మడి జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పదవుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ చొరవ చూపితే కరీంనగర్‌కు ఎయిర్‌పోర్టు మంజూరు చేయించడం పెద్ద కష్టమేమీ కాదు. కరీంనగర్‌ మరింతగా అభివృద్ధి చెందాలంటే ఎయిర్‌పోర్టు రావాలి. ఐటీ పరిశ్రమలు కూడా కరీంనగర్‌కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎయిర్‌ పోర్టు మంజూరు చేయించాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుతున్నారు. ఇదే జరిగితే… పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మరోవైపు ఎయిర్‌ పోర్టు మంజూరైతే ఉమ్మడి కరీనంగర్‌ జిల్లాలోని జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం, వేములవాడతోపాటు మంచిర్యాల, హుస్నాబాద్‌ ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ పట్టణాలు కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.