HomeతెలంగాణPonguleti - Jupalli : పొంగులేటి , జూపల్లి.. ఏ పార్టీలోకి.. ఈ ఉత్కంఠకు ఎప్పుడు...

Ponguleti – Jupalli : పొంగులేటి , జూపల్లి.. ఏ పార్టీలోకి.. ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెర?

Ponguleti – Jupalli : ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూనే ఉంది. ఓ వర్గం మీడియా రేపు మాపు అంటూ వార్తలు రాస్తూనే ఉంది. సోషల్ మీడియా అయితే ఇక చేరిపోయినట్టే అని అల్టిమేటం ఇచ్చేసింది. ఇన్ని వార్తల మధ్య అసలు ఆయన పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారా? రాహుల్ గాంధీతో  జూమ్ మీటింగ్ లో పాల్గొన్నప్పటికీ ఏ విషయాన్ని ఎందుకు స్పష్టం చేయడం లేదు? మొన్న బుధవారం హైదరాబాదులో ప్రెస్ మీట్ పెట్టి ఎన్నడు చేరేది చెబుతామని లీకులు ఇచ్చారు? మరి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ఇంతకీ ఆయన చేరతారా? లేక ఇలానే కాలం పొద్దు పుచ్చుతారా?!

ఖమ్మం జిల్లాకు చెందిన పార్లమెంట్ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత జనవరిలో అధికార భారత రాష్ట్ర సమితికి వ్యతిరేక స్వరం వినిపించారు. కెసిఆర్ పాలన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఏ ఒక్క అధికార పార్టీ ఎమ్మెల్యే ని కూడా మళ్లీ అసెంబ్లీ గేటు తొక్కనివ్వనని స్పష్టం చేశారు. ఇది జరిగిపోయి దాదాపు ఆరు నెలలు అవుతుంది. ఆలు లేదు, చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. తను ఏ పార్టీలో చేరబోతున్నానో చెప్పకుండానే పొంగులేటి వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈలోగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడంతో తన రాజకీయ ప్రయాణాన్ని ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అయితే అంతకుముందు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఈటెల రాజేందర్, మాధవనేని రఘునందన్ రావు ఆయనను బిజెపిలోకి ఆహ్వానించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
రాహుల్ టీం కలిసింది
ఇక అప్పట్లో రాహుల్ గాంధీకి చెందిన ఒక టీం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసింది. పార్టీలోకి రావాలి అని ఆహ్వానించింది. దీనికి ఎస్ అని గాని నో అని గాని పొంగులేటి సమాధానం చెప్పలేదు. అయితే ఇదే సమయంలో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలలో జూపల్లి కృష్ణారావుని కూడా భాగస్వామ్యం చేయడం కొంతమేర ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది జరుగుతుండగానే కర్ణాటక రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన అడుగులు కాంగ్రెస్ వైపు వెళ్తున్నాయని అనుచరుల ద్వారా హింట్ ఇచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తన నోటి ద్వారా ఎప్పుడూ చెప్పలేదు.. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కూడా ఎటువంటి విషయాన్ని ఆయన నోరు విప్పలేదు. కార్యకర్తలను భారీగా పిలవడం,  వారితో సమావేశం నిర్వహించడం, ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపడం వంటి వాటికి మాత్రమే పొంగులేటి పరిమితం అయిపోయారు. వాస్తవానికి ఒక నాయకుడిని నమ్ముకుని చాలామంది ఉంటారు. అతడి ప్రయాణం ఆధారంగా తమ రాజకీయ భవిష్యత్తును అంచనా వేసుకుంటారు. కానీ పొంగులేటి విషయంలో మాత్రం ఎందుకో తన రాజకీయ ప్రయాణం విచిత్రంగా మారినట్లు కనిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తుంటే, స్థానికంగా ఉన్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ రెంటి మధ్యలో ఎటువైపు వెళ్ళాలో నిర్ణయించుకోక పొంగులేటి ఒకింత గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
మీడియా చెబుతున్న సమాచారం ప్రకారం..
 మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పక్కా. కానీ ఆ మాటే ఆయన నోటి వెంట రావడం లేదు.. పైగా ఇటీవల అమిత్ షా ఖమ్మం రావాల్సి ఉండేది. కానీ యాదృచ్ఛికంగా ఆయన పర్యటన వాయిదా పడింది. ఇదే సమయంలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతానని, ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఆయన ఎటువంటి ప్రెస్ మీట్ నిర్వహించలేదు.. దీనికి తోడు రేవంత్ రెడ్డి పొంగులేటి ఇంటికి వెళ్లారని ప్రచారం జరిగింది. తర్వాత అది గాలికి పోయిన పేలపిండి సామెతను గుర్తు చేసింది..ఇక అమిత్ షా ఖమ్మం పర్యటన రద్దు కావడం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటువంటి విలేకరుల సమావేశం నిర్వహించకపోవడం.. రెండు వేరువేరు ఘటనలు అయినప్పటికీ ఎందుకో సారూప్యత కనిపిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే తెరవెనుక ఏదైనా జరుగుతోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాలం గడిస్తే కానీ వీటికి సమాధానాలు దొరకడం కష్టం.
Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version