Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, సెలబ్రిటీల ఓటు వినియోగం, ఒకే కుటుంబంలో నాలుగు తరాల వారు ఒకేసారి ఓటు వేయడం వంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 2290 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ ఊపందుకుంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. వారి గెలుపోటములను నిర్దేశించనున్నారు. అయితే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తయారు చేయడం విశేషం. 100% పోలింగ్ లక్ష్యంగా ఈసీ ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల ముఖద్వారాలు, ఆవరణలను పూలతో అలంకరించారు. పోలింగ్ కేంద్రాల్లోని గదులను సైతం ముస్తాబు చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ని పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలంగాణలోని ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, దర్శకుడు తేజ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు ఓటు వేసేందుకు ముందుకు రావడం విశేషం. హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ కు చెందిన కొత్త ఓటరు మానస, ఆమె తల్లి కవిత, అమ్మమ్మ జనబాయి, అవ్వ రుక్కమ్మ ఒకేసారి ఓటు వేసేందుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అయితే వీరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈసారి కొత్త ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఓటు వేసేందుకు వారు కుటుంబ సభ్యులతో వస్తున్నారు.అయితే ఎన్నడూ లేని విధంగా ఓటు వేసేందుకు అన్ని వర్గాల ప్రజలు మొగ్గుచూపుతుండడం విశేషం. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం ఉంటుందని ఈసీ ఆశిస్తోంది. సాయంత్రం 6 గంటల తర్వాత దీనిపై స్పష్టత రానుంది.
