Phone Tapping Case: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వం ఇలా చేస్తుందని.. రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఒకరకంగా ఇది గులాబీ పార్టీ అధినేత కేసిఆర్.. ఆ పార్టీ కార్యవర్గానికి షాక్ అని చెప్పవచ్చు.
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని భావిస్తున్న ట్యాపింగ్ వ్యవహారంలో నాటి డిఎస్పి ప్రణీత్ రావు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటిలిజెన్స్ విభాగంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం అనేక పర్యాయాలు విచారించింది. ఈ జాబితాలో డీఎస్పీ ప్రణీత్ రావు కూడా ఉన్నారు.
ప్రణీత్ రావు ఇప్పటికే జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆయనను అనేక పర్యాయాలు విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. ఇప్పుడు సంచలన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం పూర్తిగా ఈ కేసు మీద దృష్టి సారించిన నేపథ్యంలో డిఎస్పి ప్రణీత్ రావు కు ఊహించని షాక్ ఇచ్చింది. డీఎస్పీ నుంచి సిఐ స్థాయికి ప్రణీత్ రావు ను డీమోట్ చేసింది. ఇప్పటికే హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కు చెందినవారు. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈయనను సస్పెండ్ చేసింది. అనేక పర్యాయాలు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. అతడి దగ్గర నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టింది. ఇటీవల ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ను విచారించింది. వారి దగ్గర నుంచి సమాచారం సేకరించింది. ఈ కేసుపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ప్రణీత్ రావు ను డిఎస్పి నుంచి సీఐ స్థాయికి డిమోట్ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక డిఎస్పి అధికారిని సిఐ స్థాయికి తగ్గించడం ఇదే తొలిసారి.. ప్రణీత్ రావు స్థాయిని తగ్గించడంతోనే సరిపోదని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా ఎన్ని పరిణామాలు చూడాల్సి ఉంటుందోనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని విచారిస్తారని.. అవసరమైతే అరెస్టులు కూడా చేస్తారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం వేస్తున్న అడుగులు ఎవరికీ అంతు పట్టడం లేదు. విచారణతోనే అధికారులు ఆగిపోవడం లేదు.. విలువైన సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు.