HomeతెలంగాణTelangana political alliances: అధికారం కోసం దిగజారిన పార్టీలు.. ఇది ప్రజాస్వామ్య మా? ఇంతోటి దానికి...

Telangana political alliances: అధికారం కోసం దిగజారిన పార్టీలు.. ఇది ప్రజాస్వామ్య మా? ఇంతోటి దానికి ఎన్నికలు ఎందుకు?

Telangana political alliances: తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ప్రజల ఆలోచన విధానం అద్భుతంగా ఉంటుంది. అందువల్లే అంతటి తెలంగాణ ఉద్యమంలో ప్రజలు మూకుమ్మడిగా పాల్గొన్నారు. ఎన్ని రకాల ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ.. వెనకడుగు వేయకుండా.. ముందుకు సాగారు…

స్వరాష్ట్ర సాకారం అయిన తర్వాత తెలంగాణ ప్రజల్లో రాజకీయ చైతన్యం మరింత పెరిగింది. అందువల్లే ఏ ఎన్నికల్లో కూడా అధికార పక్షాన్ని చిన్నచూపు చూడలేదు. అలాగని ప్రతిపక్షానికి రిక్తహస్తం చూపించలేదు. అధికార పార్టీతోపాటు.. ప్రతిపక్ష పార్టీ కూడా బలంగా ఉండాలని కోరుకున్నారు..

ఉదయం లేస్తే పరస్పరం తిట్టుకునే రాజకీయ పార్టీలు.. దుమ్ము ఎత్తిపోసుకునే నాయకులు.. అధికారం కోసం మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజలు వేసిన ఓటును అపహస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలగర్భంలో కలిపేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజల రాజకీయ చైతన్యం గంగపాలవుతోంది . ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇది నిరూపితమైంది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఒక జిల్లా అని లేదు. అన్ని జిల్లాలలో అధికారం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిపోయాయి. విమర్శలు చేసుకుంటూ ఇన్నాళ్లపాటు ప్రజలను పిచ్చివాళ్లను చేసిన రాజకీయ పార్టీలు.. అధికారం కోసం ఏకమైపోయాయి. ఓట్లు వేసిన ప్రజలను పిచ్చివాళ్లను చేశాయి.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మేయర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం, బి ఆర్ ఎస్ సపోర్ట్ చేసింది.

కామారెడ్డి మున్సిపాలిటీలో గులాబీ పార్టీ కౌన్సిలర్ల సహాయంతో కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ గులాబీ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడంతో చైర్పర్సన్ గా ఉమారాణి ఎన్నికయ్యారు.

రంగారెడ్డి జిల్లాలో అమనగల్లు మున్సిపాలిటీలో ఆరవ వాటి నుంచి పత్యానాయక్ అనే వ్యక్తి కౌన్సిలర్ గా గెలిచాడు. గులాబీ పార్టీ నుంచి అతడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. దీంతో అతడే మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. అయితే ఇక్కడ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిజెపి మద్దతు ఇచ్చింది. ఈ మున్సిపాలిటీ పరిధిలో గులాబీ పార్టీకి 8 స్థానాలు వచ్చాయి . కమలం పార్టీకి ఆరు.. కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం లభించింది. అనంతరం జరిగిన మార్పుల వల్ల పత్య నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైస్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ బిజెపి కి అప్పగించింది…

మేడ్చల్ జిల్లాలో ఆలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ, బిజెపి ఏకమయ్యాయి. చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన శిరీష రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా మాలతి ఎన్నికయ్యారు.

ఎల్లంపేట మున్సిపాలిటీలో గులాబీ పార్టీ, కమలం పార్టీ పదవులను సమానంగా పంచుకున్నాయి. చైర్ పర్సన్ గా గులాబీ పార్టీ అభ్యర్థి శ్రీదేవి.. వైస్ చైర్మన్ గా బిజెపి అభ్యర్థి మేకల రజిత ఎన్నికయ్యారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వడంతో గులాబీ పార్టీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మూడు.. బిజెపికి ఐదు.. గులాబీ పార్టీకి మూడు స్థానాలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బి ఆర్ ఎస్ కు సపోర్ట్ చేయడంతో.. గులాబీ పార్టీకి చెందిన రవి అనే వ్యక్తి చైర్మన్ అయ్యారు.

మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో బిజెపి సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ 26 స్థానాలు ఉంటాయి. బిజెపికి పది వచ్చాయి. గులాబీ పార్టీకి ఆరు స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి ఆరు స్థానాలు లభించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నలుగురు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 14 స్థానాలు ఇక్కడ ఎవరికి రాకపోవడంతో. బిజెపి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సపోర్ట్ చేయడంతో గులాబీ పార్టీ పీఠాన్ని సొంతం చేసుకుంది.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కి బిజెపి సపోర్ట్ చేయడంతో.. పీఠాన్ని సొంతం చేసుకుంది.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడంతో..బీ ఆర్ ఎస్ అధికారాన్ని సొంతం చేసుకుంది.

నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్యలో చైర్మన్ పదవి దోబూచులాట ఆడింది. చివరికి బిజెపి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని దక్కించుకుంది.

జిన్నారంలో గులాబీ పార్టీకి మద్దతు లేకపోయినప్పటికీ.. బిజెపితో జట్టు కట్టింది. ఇక్కడ గులాబీ పార్టీ అభ్యర్థి చైర్మన్ పదవి సాధించారు. బిజెపి అభ్యర్థికి వైస్ చైర్మన్ పదవి లభించింది.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular