Ponguleti press rule: ప్రెస్.. ఈ పదం ఒకప్పుడు గొప్పగా ఉండేది. ఇందులో పని చేస్తున్న వారికి విలువ అద్భుతంగా ఉండేది. కానీ, ఎప్పుడైతే ఈ ప్రెస్ లో అనర్హులు చేరిపోయారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. గొప్ప కాస్త తగ్గిపోయింది. విలువ కాస్త కాలగర్భంలో కలిసిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రెస్ అనే పదానికి ఇప్పుడు విలువలేదు. అందులో పని చేసే వారికి గుర్తింపు లేదు.
ప్రెస్ లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇస్తుంది. గతంలో గుర్తింపు కార్డులు మాత్రమే ప్రభుత్వాలు ఇచ్చేవి. ప్రభుత్వాలు ఇప్పుడు పాత్రికేయులకు సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. అందువల్లే గుర్తింపు కార్డులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా అనర్హులు కూడా మీడియాలోకి రావడం మొదలైంది. దీంతో గుర్తింపు కార్డులు అంగట్లో సరుకులాగా మారిపోయాయి. అసలు ఎవరు జర్నలిస్టు? ఎవరు ఎర్నలిస్టు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియని దుస్థితి దాపురించింది..
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పాత్రికేయుల గుర్తింపు కార్డుల విషయంలో ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇది కాస్త వివాదానికి దారి తీసింది. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ.. ఇకపై ప్రెస్ అనే పదాన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్న పాత్రికేయులు మాత్రమే వాడాలని.. వారి వాహనాలపై గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే ప్రెస్ అనే స్టికర్లు వేసుకోవాలని సమాచార శాఖ నిబంధన విధించింది.
వాస్తవానికి గుర్తింపు కార్డుల మంజూరు అనేదే పెద్ద మాయాజాలం. వారిలో అర్హుడు ఎవరో తెలియదు. అనర్హుడు ఎవరో అంతకంటే తెలియదు. ఆ పైరవీల గురించి చెప్పుకుంటే చాంతాడంత జాబితా అవుతుంది. డి పి ఆర్ ఓ లు, గుర్తింపు కార్డుల కమిటీ మెంబర్లు చేసే ఆ వ్యవహారం లో అక్రమాలు ఒక స్థాయిలో ఉంటాయి.
తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రెస్ స్టిక్కర్ విషయంలో తీసుకొచ్చిన నిబంధనల వల్ల ఇటువంటి ఉపయోగం ఉంటుంది? ప్రభుత్వం ఏమైనా ఉదారంగా పాత్రికేయులకు వరాలు ఇస్తోందా? మినహాయింపులు ఇస్తోందా? ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఇటీవల ఓ వ్యక్తి ప్రెస్ అని స్టిక్కర్ వేసుకున్నాడు. జేబులో గుర్తింపు కార్డు కూడా ఉంది. కొన్ని వ్యాలిడిటీ ఎక్స్టెన్షన్ స్టిక్కర్లు కూడా ఉన్నాయి. కానీ పోలీసులు అతడిని ఆపారు. చలాన్ కూడా వేశారు. ఈ ఉదాహరణ చాలు ప్రెస్ స్టిక్కర్ వల్ల ఎంతటి ప్రయోజనం ఉందో? చివరిగా ప్రెస్ అనే స్టిక్కర్ల వల్ల ఎవరికి ఉపయోగం? పోనీ ప్రభుత్వం ఇంతవరకు గుర్తింపు కార్డులను ఇచ్చిందా? తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ.. ఇంతవరకు కొత్తగా గుర్తింపు కార్డులు ఇచ్చిన దాఖలు లేవు..
రవాణా శాఖ నిబంధన ప్రకారం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపై ఎటువంటి హోదాలు ఉండకూడదు. అక్షరాలు కూడా ఉండకూడదు. నిబంధన ప్రకారం కేవలం రిజిస్టర్ నెంబర్ మాత్రమే ఉండాలి. దానికి కూడా ఒక పద్ధతిని పాటించాలి. కనీసం ఈ విషయమైనా సమాచార పౌర సంబంధాలను పర్యవేక్షించే అధికారులకు తెలుసో? తెలియదో? కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పును పదేపదే చెబుతున్న తెలంగాణ పౌర సంబంధాల శాఖ.. అక్కడి ప్రభుత్వం ఇచ్చినట్టు గుర్తింపు కార్డులు ఎందుకు ఇవ్వలేకపోతోంది? ఇదే కదా ఇప్పుడు అసలైన ప్రశ్న.. దీనికి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు సమాధానం చెబుతారో? లేదో? మరి!