Paramedical Colleges: వైద్యులు కేవలం రోగానికి చికిత్స మాత్రమే చేస్తారు. ఆ రోగాన్ని నిర్ధారించేవారు వేరే ఉంటారు. వారినే వైద్య పరిభాషలో పారామెడికల్ సిబ్బంది అంటారు. కాస్త అటు ఇటుగా వైద్యులు చదివినదంతా వీరు వల్లె వేస్తారు. ప్రయోగ కేంద్రాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. రక్తం నుంచి మూత్రం దాకా పరీక్షలు చేస్తారు. అందులో ఏముందో తెలుసుకుంటారు. వీరు చూసి నిర్ధారించిన తర్వాతే వైద్యులు చికిత్స ప్రారంభిస్తారు. మరి అలాంటి పారామెడికల్ సిబ్బందికి బంగారు తెలంగాణలో సదుపాయాలు లేవు. ప్రభుత్వం ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను అడ్డగోలుగా వెనకేసుకుంటున్న కళాశాలలు.. నిబంధనలకు వక్ర భాష్యం చెబుతున్నాయి. అంతేకాదు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులకు ప్రయోగ ఫలాలు అందడం లేదు.. దీంతో ఏమీ నేర్చుకోకుండానే కేవలం పట్టాలతో విద్యార్థులు బయటకు వెళ్తున్నారు. బయట మార్కెట్ అవసరాలకు ఆధారంగా పనిచేయకపోవడంతో వారంతా ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు.
వాస్తవానికి పారామెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. అందులో ఉన్న సౌకర్యాలను ఎప్పటికప్పుడు ఆరా తీయాలి. విద్యార్థుల ప్రగతి గురించి పరిశీలన జరపాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల పారామెడికల్ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. అయితే ఈ కాలేజీలు ఎక్కువ శాతం అధికార పార్టీ నాయకులకు చెందినవి కావడం విశేషం. కొన్ని చోట్ల కేవలం ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మాత్రమే కాలేజీలు నిర్వహిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇన్నాళ్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన ప్రభుత్వం..10 సంవత్సరాల తర్వాత మేల్కొంది. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో మొద్దు నిద్ర వీడింది. రాష్ట్రవ్యాప్తంగా పారామెడికల్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ఏ ఒక్క కాలేజీలోనూ సరైన సౌకర్యాలు లేకపోవడంతో తనిఖీకి వచ్చిన అధికారులు ముక్కున వేలేసుకున్నారు. సౌకర్యాలు లేకపోవడంతో ఏకంగా 5000 సీట్లలో కోత విధించారు. తదుపరి చర్యలకు ప్రభుత్వానికి ఏకంగా ఒక నివేదిక పంపించారు.
ఇక చాలా కాలేజీలు ప్రభుత్వం నుంచి కేవలం 50 సీట్లకు మాత్రమే అనుమతి తీసుకొని.. అనధికారికంగా 100 మందికి అడ్మిషన్లు ఇస్తున్నాయి. గత పది సంవత్సరాలుగా ఈ ప్రక్రియ నిరాటకంగా సాగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ నగర శివారులోని ఓ పారా మెడికల్ కాలేజీలో చదివిన విద్యార్థులను రాష్ట్రంలోనే పేరుపొందిన ఒక కార్పొరేట్ ఆస్పత్రి యాజమాన్యం క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకుంది. జీతాలు కూడా బాగానే ఇస్తామని ఆఫర్ చేసింది.. కానీ తీరా వారికి ఎటువంటి అనుభవం లేకపోవడంతో అందరిని ఇళ్లకు పంపించేసింది.. ఇదే విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక సిద్దిపేట ప్రాంతానికి చెందిన కొంతమంది పారామెడికల్ విద్యార్థులు నేరుగా మంత్రి హరీష్ రావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది..కొన్ని కాలేజీలను కోళ్లఫారాలు, రేకుల షెడ్లలో నిర్వహిస్తున్నారంటే స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. పారా మెడికల్ కాలేజీలో వైద్య పరికరాలు ఉండాలి. కనీసం పిప్పెట్, బ్యూరెట్లు కూడా లేవంటే నిర్వాహకులకు విద్యార్థుల మీద ఎంత ఆసక్తి ఉందో ఇట్టే అవగతమవుతుంది. తాజాగా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం ఈ సంవత్సరం దాదాపు 5వేల సీట్లకు కోత విధించే అవకాశం కనిపిస్తోంది.. సీట్ల కోత ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ భారం తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. ఆ కళాశాలలో సౌకర్యాలు కల్పించే విధంగా యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకు రాలేకపోవడం విశేషం.