HYDRA: రేసు గుర్రంలా రేవంత్‌.. కబ్జాదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా..ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతన్నారు. భవిష్యత్‌లో క్లీన్, గ్రీన్‌ సిటీ లక్ష్యంగా నగరంలో కబ్జాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగిస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : August 24, 2024 5:21 pm

HYDRA

Follow us on

HYDRA: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. ఎన్నికల సమయం నుంచే కేసీఆర్‌ను మించిన దూకుడు ప్రదర్శించి బీఆర్‌ఎస్‌ను ఓడించిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అక్రమాలపై విచారణ కమిషన్లతో తగ్గేదేలే అనిపించుకున్నారు. ఇక హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందుకోసం హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. రంగనాథ్‌ను దీనికి కమిషనర్‌గా నియమించి దూకుడు కొనసాగిస్తున్నారు. చెరువులను చెర విడిపిస్తున్నారు. కుంటలను కబ్జాదారుల నుంచి కాపాడుతున్నారు. దీంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు తమ కట్టడాలపైకి దూసుకువస్తాయోనని చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు. హైడ్రా దూకుడు తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే చిన్నారులను మత్తులో ముంచుతున్న ఉన్మాదుల పై కొరడా ఝళిపిస్తున్నారు.. నాణ్యత పాటించని హోటల్‌ యజమానులపై ఉక్కుపాదం మోపారు.. సర్కారు అంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నలుగురి నోళ్లలో నానుతోంది. పది నెలలు పూర్తిచేసుకుంటున్న కాంగ్రెస్‌ సర్కారు ఇకమీదట తన ముద్ర చూపే దిశగా అడుగులేస్తోంది. ఇప్పుడు హైడ్రాతో చెరువులు, కుంటలను ఆక్రమించిన కబ్జాదారుల భరతం పడుతున్నారు. వాస్తవానికి డిసెంబరులోనే అధికారంలోకి వచ్చినా.. మధ్యలో లోక్‌ సభ ఎన్నికలతో రెండు నెలలు కోడ్‌ కింద పోయింది. ఆ గ్యాప్‌ తర్వాత పూర్తిగా ఫోకస్‌ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అదే పనిచేస్తోంది రేవంత్‌ ప్రభుత్వం.

అక్రమార్కులపై హైడ్రా పిడుగు..
చెరువులు.. నేచర్‌ అందించిన పెద్ద వనరు. అలాంటివాటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే.. వర్షాకాలంలో వరదలు ఊళ్లోకి వస్తుంది. కానీ, ఎవరేం చేస్తారులే అనుకుంటూ.. ఆక్రమణలే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు బడాబాబులు హైదరాబాద్‌ లో చెరువులను చెరబట్టారు. హైదరాబాద్‌ తాగునీటికి ఒకప్పుడు గుండెకాయలాంటి గండిపేట జలాశయం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ పరిధిలో ఓ కేంద్ర మాజీ మంత్రి ఏకంగా పది ఎకరాలను కబ్జా చేసేశారు. ఈయన దేశానికి అత్యంత కీలకమైన శాఖను చూసిన మంత్రి కావడం గమనార్హం. అలాంటి ఆయనే చెరువుల ’రక్షణ’ను మరిచారు. గత ఆదివారం గండిపేట, హిమాయత్‌ సాగర్‌ జంట జలాశయాల పరిధిలో ఆక్రమణలకు పాల్పడ్డ పది నిర్మాణాలను కూల్చివేశారు. ఇప్పుడు హైడ్రా ఎక్కడ దాడి చేస్తుందోననే ఆందోళన అక్రమార్కుల్లో నెలకొంది.

ఎన్‌ కన్వెన్షన్‌ నేలమట్టం..
ఇక శనివారం(ఆగస్టు 24న) సినీ హీరో నాగార్జున సైతం చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలపై చర్యకు దిగింది. ఈ నిర్మాణంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఆరోపణలు వచ్చాయి. కూల్చివేత ప్రయత్నాలూ జరిగాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలకు దిగింది. కాగా.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని.. స్టే ఆర్డర్‌ ఇచ్చినా చట్ట విరుద్ధంగా కూల్చారని నాగార్జున ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హైడ్రాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారంటేనే ఆ సంస్థ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా..(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అనేది సీఎం రేంత్‌ మానస పుత్రిక. దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే. హైదరాబాద్‌ను ఫ్యూచర్‌ సిటీగా నిలిపే ఉద్దేశంలో హైడ్రాను తీసుకొచ్చారు.

గంజాయిపైనా..
డ్రగ్స్, గంజాయిపై రేవంత్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. డగ్స్, గంజాయి అనే మాటే వినపడేందుకు వీల్లేదన్న సీఎం రేవంత్‌ ఆదేశాల మేరకు పోలీసులు, టీఎస్‌ న్యాబ్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైదరాబాద్‌ పబ్‌లపై వరుసగా దాడులు చేస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న డీజే (డిస్క జాకీ)లనూ పట్టుకుని లోపలేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు తనిఖీలు, దాడులు చేస్తున్నారు.

కల్తీ ఆహారంపై కొరడా..
హైదరాబాద్‌ అంటేనే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్‌. అలాంటి బిర్యానీలను విక్రయించే రెస్టారెంట్లు ప్రమాణాలు పాటించడం లేదు. అన్నీ రెస్టారెంట్లు, హోటళ్లు కాకున్నా.. పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిజ్‌ లో ఉంచిన చికెన్, మటన్‌ వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌ లోనే కాక రాష్ట్రవ్యాప్తంగానూ దాడులు చేస్తూ.. ఆహార ప్రమాణాలపై రాజీ లేదని చాటుతున్నారు.

స్వాగతిస్తున్న నెటిజన్లు..
ఇక రేవంత్‌ దూకుడును నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ప్రజల కోసం చేపడుతున్న పనులను అడ్డుకోవద్దని, ఆపొద్దని కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టించుకోని ఆక్రమణలపై రేవంత్‌రెడ్డి కొరడా ఝళిపించడాన్ని అభినందిస్తున్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవంతులను హైడ్రా ద్వారా కూల్చేస్తున్నారని చెబుతున్నారు. యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి ఆటకట్టిస్తున్నారని, వాటిపై యుద్ధం చేస్తున్నారని కొనియాడుతున్నారు. ఇక నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై రైడ్‌ చేస్తున్నారంటున్నారు.