Government Teachers NCTE: ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత తప్పనిసరి చేసింది ఎస్‌సీటీఈ. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లగా అత్యున్నత న్యాయస్థానం కూడా నిర్ణీత గడువులోగా టెట్ అర్హత సాధించాలని స్పష్టం చేసింది. టెట్ లేనివారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్ల విషయంలో ప్రాధాన్యం ఇవ్వొద్దని పేర్కొంది. అయితే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విధుల్లో ఉన్న టీచర్లకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వినతిని ఎన్‌సీటీఈ తాజాగా పూర్తిగా తిరస్కరించింది. గతంలో ఎంపికైన ఉపాధ్యాయులకు కొంత వెసులుబాటు ఇవ్వాలని సంఘాలు, టీచర్లు రాసిన పత్రాలను తోసిపుచ్చింది.
సుప్రీం తీర్పు ప్రభావంతో..
ఇటీవల సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం, ఏ ప్రభుత్వ టీచర్ అయితే 5 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేశాడో, అలాంటి ప్రతీ ఒక్కరూ రెండు సంవత్సరాల వ్యవధిలో టెట్ అనివార్యంగా ఉత్తీర్ణత సాధించాల్సిందే. ఇది ఇటీవల 2017లో పార్లమెంట్‌లో దిద్దుబాటు చేసిన నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న తీర్పు కావడం గమనార్హం. సుప్రీం ధర్మాసనం చెప్పిన తీర్పును 2017లో పార్లమెంట్ చేసిన తీర్మానాన్నే ఆధారంగా చూపారు. అయితే, టీచర్లు తమ నియామకాలు అంతకు ముందు జరిగాయని, కొత్త నిబంధనల ప్రభావం అందరికీ వర్తించకూడదని అభ్యర్థించినా, ఆ వాదనలను ఎన్‌సీటీఈ పరిగణనలోకి తీసుకోలేదు.
ఉపాధ్యాయుల్లో ఒత్తిడి..
టెట్ అభ్యర్థన విషయంలో వచ్చిన వినతులను ఎన్‌సీటీఈ తిరస్కరించడంతో ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇప్పటికే విధుల్లో ఉన్నవారు కూడా టెట్ ఉత్తీర్ణత కీలకంగా మారడంతో, ఉద్యోగ భద్రతపై అనేక మంది ఆందోళన చెందుతున్నారు. తాజా నిర్ణయానికి కొంతకాలపాటు గరిష్ఠ గడువు ఇచ్చినా, పరీక్ష పాస్ అయేంత వరకు ఒత్తిడి తొలగదు.
నూతన విధానాల అమలులో నాన్–టెట్ టీచర్లకు ఇక వెసులుబాటు లేకుండా మారింది. ఎన్నాళ్లుగా డ్యూటీలో ఉన్నా టెట్ అర్హత తప్పదు. విద్యారంగంలో నాణ్యతను పెంపొందించేందుకు తీసుకుంటున్న ఈ మార్గం కొంతమందికి సవాళ్లను, మరికొంతమందికి నూతన అవకాశం కావచ్చు.