Municipal Election Results: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొంతమంది ఎమ్మెల్యేలకు కష్ట కాలాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలలో ఆ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో ప్రతికూల ఫలితాలు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీలో ఎవరంటే
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఎనిమిది మాత్రమే గెలిచింది. గులాబీ పార్టీ 13 స్థానాలలో విజయం సాధించింది.
మైనపల్లి రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గంలో మొత్తం 32 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ గులాబీ పార్టీ 15 స్థానాలు సాధించింది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు దక్కించుకుంది.
తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ 15 వార్డులకు ఐదు మాత్రమే గెలిచింది. గులాబీ పార్టీ పది స్థానాలు దక్కించుకుంది. ఈ నియోజకవర్గంలో మందుల సామేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం లో బొజ్జు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ మున్సిపాలిటీలోని 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. దారుణంగా మూడో స్థానంలో నిలిచింది..
వర్ధన్నపేట నియోజకవర్గంలో కేఆర్ నాగరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 12 వార్డులకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కంటే ఒక స్థానాన్ని తక్కువ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
మంత్రి వివేక్ నియోజకవర్గమైన చెన్నూరులో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గులాబీ పార్టీ అత్యధికంగా స్థానాలను సొంతం చేసుకుంది.
కల్వకుర్తి నియోజకవర్గంలో కాశిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యే గా ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అమనగల్లులో 15 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వార్డు మాత్రమే గెలిచింది. కల్వకుర్తిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ స్థానాలు రావడం విశేషం..
నారాయణపేట నియోజకవర్గం లో పర్ణిక రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 24 వార్డులలో బిజెపి 11 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఏడు మాత్రమే దక్కించుకుంది..
భారత రాష్ట్ర సమితిలో
జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సూర్యపేట నియోజకవర్గంలో 48 స్థానాల లో గులాబీ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలలో విజయం సాధించింది.
హుజురాబాద్ నియోజకవర్గం లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 30 వార్డులు ఉంటే గులాబీ పార్టీకి కేవలం 8 స్థానాలు మాత్రమే లభించాయి.. ఇదే నియోజకవర్గంలో జమ్మికుంట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కంటే గులాబీ పార్టీ రెండు ఎక్కువ వార్డులు సాధించి.. మొదటి స్థానంలో ఉంది.
డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గా ఉన్న కోరుట్ల నియోజకవర్గం లో 33 వార్డులకు గానూ గులాబీ పార్టీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మెట్ పల్లి నియోజకవర్గంలో కూడా గులాబీ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
జహీరాబాద్ నియోజకవర్గంలో మాణిక్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ గులాబీ పార్టీ కాంగ్రెస్ కంటే ఒక స్థానాన్ని తక్కువ దక్కించుకుంది. ఇక ఇదే నియోజకవర్గంలోని కోహిర్ ప్రాంతంలో 16 వార్డులు ఉంటే.. భారత రాష్ట్ర సమితి ఐదు స్థానాల వరకే ఆగిపోయింది.
సంగారెడ్డిలో చింత ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ 38 వార్డులు ఉంటే.. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 22 వార్డులలో విజయం సాధించింది. గులాబీ పార్టీ కేవలం పది స్థానాలతోనే సరిపుచ్చుకుంది. సదాశివపేట ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 16 స్థానాలను గెలుచుకోవడం విశేషం.
మల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మేడ్చల్ నియోజకవర్గంలో ఆలియాబాద్ మున్సిపాలిటీలో గులాబీ పార్టీ కేవలం ఏడు స్థానాల మాత్రమే సాధించింది. ఈ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఇక ఈ నియోజకవర్గంలోని ఎల్లంపేట, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలలో మాత్రం గులాబీ పార్టీ అత్యధిక సీటు సాధించి.. గెలుపును సొంతం చేసుకోవడం విశేషం.
భారతీయ జనతా పార్టీలో
బిజెపి ఎమ్మెల్యే శంకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్ పురపాలకంలో బిజెపి ఎక్కువ వార్డులు సొంతం చేసుకుంది. ఇక్కడ 49 స్థానాలలో 21 స్థానాలను గెలుచుకుంది బిజెపి.
వేరేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నిర్మల్ లో కమలం పార్టీ 42 వార్డులకు గాను కేవలం 13 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 24 స్థానాలను సొంతం చేసుకుంది.
రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్మూర్లో బిజెపి కేవలం ఎనిమిది వార్డులు మాత్రమే సొంతం చేసుకుంది. ఇక్కడ 36 వార్డులు ఉన్నాయి.
కాగజ్ నగర్ ఎమ్మెల్యేగా పాల్వాయి హరీష్ బాబు కొనసాగుతున్నారు. ఇక్కడ 30 వార్డులు ఉంటే.. బిజెపి కేవలం ఐదు స్థానాలు మాత్రమే గెలిచింది. దారుణంగా మూడవ స్థానానికి పరిమితం అయిపోయింది.
ముతోల్ నియోజవర్గంలో రామారావు ఎమ్మెల్యే గా ఉన్నారు. ఇక్కడి బైంసా మున్సిపాలిటీలో బిజెపి కేవలం ఆరు స్థానాలు మాత్రమే గెలిచింది.
కామారెడ్డి ఎమ్మెల్యేగా వెంకటరమణారెడ్డి కొనసాగుతున్నారు. ఇక్కడ 49 స్థానాలు ఉంటే.. కేవలం 16 స్థానాలు మాత్రమే గెలిచింది బిజెపి. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలను దక్కించుకుంది.