Telangana Congress: కేసీఆర్ కు మరో షాక్.. దానం, రంజిత్ రెడ్డిని చేర్చుకోవడం వెనుక రేవంత్ ప్లాన్ ఇదే

చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు.

Written By: Raj Shekar, Updated On : March 17, 2024 3:53 pm

Telangana Congress

Follow us on

Telangana Congress: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టయింది. ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశాలు లేవు. పైగా ఆమెను వారం పాటు కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. కెసిఆర్ కూడా కవిత అరెస్టు నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఇదంతా జరుగుతుండగానే కెసిఆర్ కు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, ఎంపీలు సండే స్ట్రోక్ ఇచ్చారు. ఆదివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో భారత రాష్ట్ర సమితిలో ఒక్కసారిగా కలకలం నెలకొంది. అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి కీలక నాయకులు కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరుతున్నారు.

చేవెళ్ల నుంచి మళ్లీ రంజిత్ రెడ్డి

చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి గత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్లు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగారు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. కవిత కేసు నిమిత్తం కేటీఆర్ ఢిల్లీ వెళ్ళటం.. రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. సరిగా పార్లమెంటు ఎన్నికల ముందు రంజిత్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఈసారి చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి పోటీలోకి దిగుతారని తెలుస్తోంది. అయితే ఈ స్థానానికి పట్న మహేందర్ రెడ్డి సతీమణి సునీత రెడ్డిని ప్రకటించారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సునీత రెడ్డికి మల్కాజ్ గిరి స్థానానికి బదిలీ చేసి, చేవెళ్లలో రంజిత్ రెడ్డితో పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని సమాచారం.

ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. 2018లో భారత రాష్ట్ర సమితిలో చేరారు. తాజాగా ఆ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదు సంవత్సరాలు పాటు భారత రాష్ట్ర సమితిలోని కొనసాగారు. ఇటీవల ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి మళ్లీ ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాకపోవడంతో కొంతకాలంగా కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఆ వ్యాఖ్యలు చేసిన మూడు రోజులకే ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది. నాగేందర్ కు టికెట్ ఇవ్వడం ద్వారా కిషన్ రెడ్డికి చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.