పిల్లలను తల్లి నవమోసాలు మోసి కంటుంది.. వారికి ఏదైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతుంది.. తన బిడ్డల జోలికి ఎవరైనా వస్తే ఆదిశక్తిగా మారుతుంది.. పిల్లల కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడుతుంది. ఇలాంటి సంఘటనే వికారాబాద్లో తాజాగా వెలుగుచూసింది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి ప్రాణాలను త్యాగంచేయడం విషాదంగా మారింది.
Also Read: తెలంగాణ ‘విమోచనం’ ఎలా అయ్యింది?
వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలం షాపూర్ తండాలో దశరథ్, అనితాబాయి(35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు. ఈ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే వీరంతా కుటుంబంతో కలిసి పత్తి చేనులో కలుపు తీసేందుకు ఆటోలో వెళ్లారు. అక్కడ పని ముగించుకొని సాయంత్రం 4గంటల సమయంలో ఇంటికి బయలుదేరారు.
ఈ సమయంలోనే భారీ వర్షం కురిసి మార్గమధ్యలో ఉన్న వాగు భారీగా ప్రవహిస్తోంది. ఇంటికి వెళ్లాలనే తొందర్లోనే వీరంతా వాగును దాటే ప్రయత్నం చేశారు. దంపతులిద్దరు తమ ముగ్గురు పిల్లలను అతికష్టం మీద వాగు దాటించారు. మరో ఇద్దరు పిల్లలను అనితా బాయి వాగు దాటిస్తున్న క్రమంలో ఆమె కాలు పట్టుతప్పి వాగులో కొట్టుకుపోయింది. పిల్లలు మరోవైపు కొట్టుకుపోగా అక్కడే ఉన్న దశరథ్ చిన్నారులను కాపాడాడు. కాగా అనితాబాయి మాత్రం వాగులో కొట్టుకుపోయింది.
Also Read: విద్యుత్ బిల్లు వెయ్యి దాటితే ఆన్‌లైన్‌లో పే చేయాల్సిందే..
భర్త ఎదుటే భార్య వాగులో కొట్టుకుపోతున్న భర్త ఏమిచేయలేని నిస్సాహాయస్థితిలో ఉన్నాడు. వాగులో కొట్టుకుపోయి అనితాబాయి మృతదేహం సుమారు 200మీటర్ల దూరంలో లభ్యమైంది. ఆమె మృతితో గ్రామంలో విషాదచాయలు నెలకొన్నాయి. పిల్లలను రక్షించేందుకు ఆమె ప్రాణత్యాగం చేయడంతో అందరూ కన్నీరుమున్నీరుగా విలపించారు.