Moinabad party real story: హైదరాబాద్ నగర శివారులో ఉన్న మొయినాబాద్ ప్రాంతంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం తెల్లవారుజామున మాదక ద్రవ్యాల పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పార్టీ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో.. వారు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి.. ఇంకా కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారికి పరీక్ష నిర్వహించగా మాదక ద్రవ్యాలు స్వీకరించినట్టు తెలింది.
పోలీసులు పట్టుకున్న వారిలో రాజస్థాన్ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. బెంగళూరు ప్రాంతానికి చెందిన లాయర్.. ఏలూరు ఎంపీ.. తాండూరు మాజీ ఎమ్మెల్యే.. వారు ఉన్నారు. వాస్తవానికి వీరి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. మాదకద్రవ్యాలు స్వీకరించే క్రమంలో వీరి మధ్య బలమైన బాండింగ్ ఏర్పడింది అని తెలుస్తోంది. వేరు వేరు నేపథ్యాలు ఉన్నప్పటికీ.. వీరంతా చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం. సెటిల్మెంట్ల క్రమంలో వీరు తరచూ మీట్ అయ్యేవారు.. వీరంతా హైదరాబాద్ వస్తే రోహిత్ రెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేవారు. అక్కడే పార్టీలు చేసుకొని.. వెళ్లేవారు. కేవలం మొయినాబాద్ మాత్రమే కాకుండా.. ఢిల్లీ, బెంగళూరులోనూ ఈ తరహా పార్టీలు జరుపుకునేవారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు మాదక ద్రవ్యాల మీద ఉక్కు పాదం మోపుతున్నారు. ప్రభుత్వం ఏకంగా ఈగల్ అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. రహస్యంగా జరిగే మాదక ద్రవ్యాల పార్టీలను ఈగల్ పోలీసులు రట్టు చేస్తున్నారు.. అయితే ఈ మత్తు పార్టీకి ఏలూరు ఎంపీ ఎలా హాజరయ్యారు.. ఆయనకు ఆ మాత్రం సోయి లేదా అని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక రోహిత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దుబాయిలో ఆయన వ్యాపారాలు చెప్పుకునే స్థాయిలో సాగడం లేదు. ఇక హైదరాబాద్ నగర పరిధిలో ఆయన నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం అంత గొప్పగా లేదు. ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి కొంతకాలంగా ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.
ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి తరచుగా పార్టీలు నిర్వహిస్తున్నారు. ఏలూరు ఎంపీ కూడా తరచూ ఇక్కడికి వచ్చి పోతున్న నేపథ్యంలో మాదక ద్రవ్యాల పార్టీని అంత సీరియస్ గా తీసుకోలేదు. పైగా మిగతావారు కూడా పోలీసులు తమ వద్దకు వచ్చి దాడులు చేసే స్థాయి లేదని అనుకున్నారు. ఇక ఈ పార్టీకి కౌశిక్ రవి అనే వ్యక్తి సిమ్లా ప్రాంతం నుంచి మత్తు పదార్థాలను తీసుకొచ్చారు. ఈ పార్టీ ఘనంగా నిర్వహించాలని చాలా రోజులుగా రోహిత్ రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కౌశిక్ రవి సర్కు తీసుకొని రాగానే.. పార్టీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళిన మహేష్.. నేరుగా మొయినాబాద్ వచ్చేసారు. రోహిత్ రెడ్డి నుంచి పిలుపు రాగానే.. మిగతా వ్యక్తులు కూడా అక్కడ వాలిపోయారు. అయితే పోలీసులు వారి ప్రయాణ వివరాలను నిర్ధారించుకున్న తర్వాత అసలు విషయాలను బయట పెడతారని తెలుస్తోంది.