MLC Kavitha: తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనం రేపారు. తన తండ్రి, పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు పార్టీలో వైఫల్యాలు.. పొత్తులు తదితర అంశాలతో ఆరు పేజీల లేఖను రాశారు. దానిని తాజాగా మీడియాకు లీక్ చేశారు. ‘మై డియర్ డాడీ’ అంటూ ఆప్యాయంగా ప్రారంభమైన ఈ లేఖలో, వరంగల్ సభ విజయం, పార్టీలోని తాజా పరిణామాలపై కవిత విస్తృతంగా చర్చించారు. పార్టీ వ్యూహాలు, నాయకత్వ నిర్ణయాలు, బీజేపీతో సంబంధాలపై స్పష్టత లేని అంశాలను లేఖలో లేవనెత్తారు. ఈ లేఖ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
మార్చి 2025లో నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు పార్టీకి కీలకమైన మైలురాయిగా నిలిచాయి. వరంగల్ సభను విజయవంతంగా పేర్కొంటూ, కవిత ఈ వేడుకలకు ముందు, తర్వాత జరిగిన పరిణామాలను లేఖలో విశ్లేషించారు. సభలో పాజిటివ్, నెగటివ్ అంశాలపై ఆమె ఫీడ్‌బ్యాక్ అందించారు, పార్టీ వ్యూహాల్లో మెరుగుదలకు సూచనలు చేశారు.
పార్టీ వ్యూహంపై విమర్శలు
సిల్వర్ జూబ్లీ సభలో బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాట్లాడడం, బీజేపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వకపోవడం లేఖలో కవిత ఆందోళన వ్యక్తం చేశారు.బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ, వక్స్ బిల్లు వంటి అంశాలపై కేసీఆర్ నోరు విప్పకపోవడంపై అసంతృప్తి వెలిబుచ్చారు. 2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు వేదికపై అవకాశం ఇవ్వకపోవడం, నాయకత్వం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్పులపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేయలేదని, ఇది కార్యకర్తలను నిరాశపరిచిందని ఆమె తెలిపారు.
బీజేపీతో సంబంధాలపై ఆందోళన
కవిత లేఖలో బీజేపీతో సంబంధాలపై వ్యక్తిగత బాధను వెల్లడించారు. “బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డాను. వారిని టార్గెట్ చేసి మాట్లాడి ఉంటే బాగుండేది,” అని ఆమె పేర్కొన్నారు. బీ ఫారమ్‌ల విషయంలో పాత ఇన్‌చార్జ్‌లకే ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
కవిత రాసిన లేఖ బీఆర్ఎస్‌లో అంతర్గత అసంతృప్తిని, రాజకీయ వ్యూహాలపై స్పష్టత లేని వాతావరణాన్ని బహిర్గతం చేసింది. వరంగల్ సభ విజయవంతమైనప్పటికీ, బీజేపీతో సంబంధాలు, సామాజిక సమస్యలపై నిశ్శబ్దం, నాయకత్వ అందుబాటు లేకపోవడం వంటి అంశాలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.