Ponguleti Srinivas Reddy Vs Konda Surekha: కాంగ్రెస్ ప్రభుత్వం లో జిల్లాకు ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఎవరు శాఖల పనులు వారు చూసుకుంటున్నారు. వారి దగ్గరకు వచ్చే అనుచరుల పనులు చక్కబెడుతున్నారు. క్షేత్రస్థాయిలో గొప్పగా కాకపోయినా తమకు ఉన్న స్థాయిలోనే పనిచేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తన మార్క్ పైత్యాన్ని ఆయా జిల్లాలలో ప్రదర్శిస్తోంది. అది అంతిమంగా ఇబ్బందులకు కారణమవుతోంది.
ఒక్కో జిల్లాకు ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులు ఉన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.. మతిలేని నిర్ణయాలు తీసుకుంది. జిల్లాకు ఇన్చార్జి మంత్రిని నియమించింది. ఇన్చార్జి మంత్రులు ఆయా జిల్లాలలో పెత్తనాలు సాగిస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తమకంటూ సొంత కోటరీని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందువల్లే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇంచార్జ్ మంత్రి వర్సెస్ మిగతా మంత్రులు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి.. దీంతో కార్యకర్తలు వర్గాలుగా విడిపోతున్నారు. చివరికి అభివృద్ధి పనుల విషయంలోనూ విభేదాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా ప్రతిపక్షానికి ఊహించని మైలేజ్ లభిస్తోంది.
ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాను తీసుకుంటే.. ఈ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అయితే ఆయన అనవసరమైన విషయాలలో వేలు పెడుతున్నారని ఇక్కడ మంత్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కొండ సురేఖకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విభేదాలు మొదలయ్యాయి. కొండ సురేఖ ఆధీనంలో ఉన్న దేవాదాయ శాఖలోని పనుల విషయంలో శ్రీనివాస్ రెడ్డి వేలు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం నిర్వహించిన మేడారం అభివృద్ధి పనుల సమీక్షకు కొండ సురేఖ హాజరు కాలేదు. శ్రీనివాస్ రెడ్డి తన కంపెనీ ద్వారా మేడారంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని.. తన అనుచరులకు పనులు కూడా కేటాయించుకోలేని పరిస్థితిలో తాను ఉన్నానని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీటిని కొండ సురేఖ ఖండించారు. అంతేకాదు కొండ సురేఖ భర్తకు ముఖ్యమంత్రి రేవంత్ క్లాస్ కూడా పీకారని తెలుస్తోంది.
ఇన్ని పరిణామాల మధ్య శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖను, సీతక్కను సమ్మక్క సారలమ్మగా అభివర్ణించారు. అయినప్పటికీ శ్రీనివాసరెడ్డి మీద సురేఖ వర్గం ఆగ్రహంతోనే ఉంది. సురేఖ శాఖలో శ్రీనివాస్ రెడ్డి అనవసరంగా వేలు పెడుతున్నారని.. అందువల్లే విభేదాలు మొదలవుతున్నాయని సురేఖ అనుచరులు అంటున్నారు. ప్రభుత్వం ఇన్చార్జి మంత్రిని తొలగించి.. యధా ప్రకారం పరిస్థితిని కొనసాగించాలని సూచిస్తున్నారు. అభివృద్ధి పనుల విషయంలో శ్రీనివాస్ రెడ్డి సంస్థ దూకుడును కొనసాగిస్తోంది . అక్కడ యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులను చేపడుతోంది. దీనిపై సురేఖ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.