Konda Surekha vs KTR : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోవడానికి కారణం కేటీఆర్ అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.. నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును నామమాత్ర పాత్రకు పరిమితం చేసి.. కేటీఆర్ షాడో సీఎం గా పనిచేశారని కొండా సురేఖ ఆరోపించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి.. వేల కోట్లు సంపాదించారని.. అనేక కుంభకోణాలకు పాల్పడ్డారని సురేఖ మండిపడ్డారు.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు అడ్డు తగిలితే సహించబోమని సురేఖ స్పష్టం చేశారు..” నాకు అంతర్గతంగా తెలిసిన సమాచారాన్ని నేను బయటపెట్టాను. తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు తెలిసిన వ్యక్తులు ఈ సమాచారం అందించారు. కోపంతోనే నేను ఆ మాటలు అన్నాను. సమంత విషయంలో నేను తప్పు పట్టడం లేదు. ఎందుకంటే సమంతకు నేను అభిమానిని. ఆమె నటించిన సినిమాలు చూశాను. పైగా ఆమె కష్టపడి పైకి ఎదిగింది. అలాంటి వ్యక్తుల పట్ల నాకు ఆరాధన ఉంటుంది. కానీ కేటీఆర్ లాంటి వ్యక్తుల అసలు రూపం సమాజానికి తెలియాలి . నేను చేసిన వ్యక్తుల వల్ల కేటీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లరు. ఇంటి వద్ద ఉంటారని” సురేఖ వ్యాఖ్యానించారు.. బుధవారం సమంత – నాగచైతన్య విడాకుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సురేఖ.. గురువారం ఉదయానికి కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ… కేటీఆర్ పై మాత్రం మరింత రెచ్చిపోయారు. తన నోటికి పదును పెట్టి విమర్శలను పెంచారు.
కొండా సురేఖ విమర్శల వెనుక..
సమంత విషయంలో కాస్త మెత్తబడ్డట్టు కనిపించిన సురేఖ.. కేటీఆర్ పై మాత్రం యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయనపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.. అయితే 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ భారత రాష్ట్ర సమితిలో చేరారు. 2018 ఎన్నికల్లో ఆమెకు భారత రాష్ట్ర సమితి టికెట్ నిరాకరించింది. అప్పట్లో టికెట్ రాకపోవడం వెనుక కేటీఆర్ ఉన్నారని సురేఖ ఆరోపించారు. 2018 నుంచి 2023 వరకు సురేఖ రాజకీయంగా తీవ్రంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే నాడు తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టి.. తమ శత్రువు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు కు కేటీఆర్ అందలం ఎక్కించడాన్ని సురేఖ – కొండా మురళి సహించలేకపోయారని విమర్శలున్నాయి. పైగా ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా సురేఖ – మురళి ఇబ్బంది పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్లే నాటి రోజులను గుర్తుచేసుకొని.. నేడు కేటీఆర్ పై సురేఖ విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. ఓ వైపు కేటీఆర్ పరువు నష్టం దావా వేసినప్పటికీ సురేఖ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం విశేషం.