Minister Konda Surekha: తెలంగాణలో 10 సంవత్సరాల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన చేయాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో కొద్ది కాలంలోనే అధికార పార్టీ మీద తెలంగాణ ప్రజలలో ఆగ్రహం పెరిగిపోయింది. అమలు చేస్తామన్న పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. మిగతా పథకాలు అంతంత మాత్రమే సాగుతున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రజలలో అసంతృప్తి తగ్గించాల్సిన బాధ్యతను భుజాలకు ఎత్తుకోవాల్సిన ప్రభుత్వం.. మరింత దారుణమైన విధానాలకు పాల్పడుతోంది. దీనికి తోడు మంత్రుల వ్యవహార శైలి కూడా ప్రభుత్వానికి తీవ్రమైన తలపోటును తెప్పిస్తోంది.
ఇటీవల పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్ మధ్య “దున్నపోతు” మాటల వ్యవహారం సంచలనం సృష్టించింది. లక్ష్మణ్ తన నిరసనను నేరుగానే వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి స్పందించక తప్పలేదు. దీంతో పొన్నం ప్రభాకర్ నేరుగా లక్ష్మణ్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఈ వివాదం తగ్గిపోయింది అనుకుంటుండగానే.. మరో ఇద్దరు మంత్రుల మధ్య వ్యవహారం రచ్చకెక్కింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య ఇటీవల వివాదాలు ఏర్పడ్డాయి.
మేడారం లోని అభివృద్ధి పనులకు సంబంధించి ఇద్దరు మంత్రులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిపోయారు. ఇంచార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన కాంట్రాక్టు సంస్థ ద్వారా మేడారం పనులు చేపడుతున్నారని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. తాను దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నప్పటికీ.. తనను కాదని ఆయన తన శాఖలో వేలు పెట్టడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా అభివృద్ధి పనులు తన కాంట్రాక్టు సంస్థ ద్వారా నిర్వహిస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనిని అధికారికంగా కొండా సురేఖ ప్రకటించకపోయినప్పటికీ.. మీడియాలో అదే తీరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సోమవారం మేడారం జాతర పనులకు సంబంధించిన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కొండ సురేఖ హాజరు కాలేదని తెలుస్తోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇతర అధికారులు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారని సమాచారం. శ్రీనివాస్ రెడ్డితో ఏర్పడిన విభేదాల కారణంగానే కొండ సురేఖ సమీక్షకు హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. కొండ సురేఖ టూర్ షెడ్యూల్ విడుదల కాకపోవడమే పై వార్తలకు బలం చేకూర్చుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కొండ మురళి , కొండ సురేఖ పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. మొన్నటిదాకా లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, సురేఖ మధ్య విభేదాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో.. అధికార పార్టీపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహార శైలికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.