HomeతెలంగాణSecond Marriage: ఆయన రెండో పెళ్లి చేసుకోకూడదా.. శంషాబాద్ లో కాపురం పెట్టకూడదా.. ఇదేం ట్రోలింగ్...

Second Marriage: ఆయన రెండో పెళ్లి చేసుకోకూడదా.. శంషాబాద్ లో కాపురం పెట్టకూడదా.. ఇదేం ట్రోలింగ్ భయ్యా?

Second Marriage: ప్రతి మనిషికి ఒక తోడు కావాలి. ముఖ్యంగా ఒక వయసుకు వచ్చిన తర్వాత తనకంటూ ఒక మనిషి కావాలి. సేవలు చేయడానికి మాత్రమే కాదు.. కబుర్లు చెప్పుకోవడానికి.. సంతోషాన్ని పంచుకోవడానికి.. బాధను షేర్ చేసుకోవడానికి.. రోజువారి జీవితంలో జరిగిన ఘటనలును విశ్లేషించడానికి.. ఒక తోడు కావాలి. ఎందుకంటే మనిషి అనే వాడు ఏకాకి కాదు. ఏ కాకి కూడా ఏకాకి కాదు కాబట్టి.. ఏ మనిషి కూడా ఒంటరిగా ఉండడు. ఉండలేడు. ఒంటరిగా ఉంటే మనిషిలో అనేక రకాలైన దిగుళ్లు వెలుగు చూస్తుంటాయి. ఒంటరితనం అనే బాధ ఇబ్బంది పెడుతుంది.

ఇలాంటి ఒంటరితనాన్ని భరించలేకే ఆ మీడియా అధినేత పెళ్లి చేసుకున్నాడు. గతంలో ఆయనకు వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. కాకపోతే ఆయన సతీమణి కాలం చేసింది. ఆయన కూడా ఒక వయసుకు వచ్చాడు. ఈ సమయంలో ఆయనకంటూ ఒక తోడు కావాలి అనిపించింది. మొదట్లో రెండవ పెళ్లి ఎందుకని కుటుంబ సభ్యులు వారించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులపాటు తన రెండవ పెళ్లికి సంబంధించి ఆ మీడియా అధినేత ఇంట్లో గొడవలు కూడా జరిగినట్టు గుసగుసలు వినిపించాయి. మొదటి భార్య ద్వారా కలిగిన కూతురు, కొడుకు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. మొత్తానికి ఆ మీడియా అధినేతకు రెండవ వివాహం జరిగింది. వాస్తవానికి ఆయన రెండవ వివాహం చేసుకోడాన్ని ఎవరూ తప్పుపట్టరు. తప్పు పట్టాల్సిన అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి అంతరంగిక జీవితంలోకి తొంగి చూసే అధికారం ఎవరికీ లేదు. ఆ మీడియా అధినేత సతి వియోగం వల్ల రెండవ వివాహం చేసుకున్నాడు.

Also Read: రిజర్వేషన్లను కోర్డు అడ్డుకుంటుందా?

ఆ మీడియా అధినేత రెండవ వివాహం చేసుకోవడం ఓ పార్టీకి ఇప్పుడు అసలు నచ్చడం లేదు. పైగా అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉండడం.. సదరు మీడియా అధినేత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అండదండగా ఉండడంతో సహజంగానే ఆ ప్రతిపక్ష పార్టీకి మండుతోంది. అందువల్లే ఆ ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియాలో ఆ మీడియా అధినేతను తీవ్రస్థాయిలో విమర్శిస్తోంది. విపరీతంగా ట్రోలింగ్ చేస్తోంది. వాస్తవానికి వ్యక్తిగత జీవితాల విషయంలో ఒకరిని ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు. విమర్శించే హక్కు కూడా లేదు. ఆ మీడియా అధినేత గతంలో ఏదో చేశాడని.. ఇప్పుడు ఈ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. ఏకంగా కుటుంబ సభ్యుల వ్యవహారాలను సోషల్ మీడియా వరకు తీసుకొస్తున్నారు. ఇది ఒక పరిధి వరకు బాగానే ఉంటుంది కానీ.. అంతకుమించి వెళ్తేనే ఇబ్బంది ఎదురవుతుంది..

రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మీడియా అధినేత హైదరాబాద్ నగర శివారులో కాపురం పెట్టారని తెలుస్తోంది. తన సన్నిహితులకు చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన కొనుగోలు చేశారని.. అక్కడే ఆయన నివాసం ఉంటున్నారని సమాచారం. అయితే గతంలో తాను సంపాదించిన ఆస్తులను కుమార్తెకు, కొడుకుకు సమానంగా పంచినట్టు వినికిడి. ఇంట్లో ఆస్తి తగదాలు పరిష్కారం అయినా తర్వాతే కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారని.. అప్పుడే ఆ మీడియా అధినేత వివాహం చేసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆ మీడియా అధినేత రెండవ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫోటోలు కూడా పెడుతున్నారు. మరి దీనిపై ఆ మీడియా అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version