Land Grabbing Allegations Against Kavitha: భారత రాష్ట్ర సమితి నుంచి బహిష్కరణకు గురై.. శాసనమండలి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి.. జాగృతి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేపడుతున్నారు కల్వకుంట్ల కవిత. భారత రాష్ట్ర సమితి పై తీవ్రస్థాయిలో ఆమె ఆరోపణలు చేస్తున్నారు. వచ్చే కొద్ది రోజులపాటు జనంలోనే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.. కవిత నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జాగృతి కార్యకర్తలు భారీగా హాజరవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు కవిత గురించి ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
కల్వకుంట్ల కవిత భర్త అనిల్ కుమార్ కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని.. కొంతమంది డాక్యుమెంట్లతో బయటకు వచ్చారు.. ఆ డాక్యుమెంట్లను మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ చేతిలో పెట్టారు. కవిత భర్త అనిల్ కుమార్ వేలాది కోట్ల విలువైన భూములను కబ్జా చేశారని.. వాటిని కాపాడాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కూకట్పల్లి ప్రాంతంలోని ఎమ్మార్వో కార్యాలయ పరిధిలో బాలానగర్ ప్రాంతానికి సమీపంలో IDPL కు చెందిన సర్వేనెంబర్ 2010/4 లో ఎంత విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని కవిత భర్త అనిల్, ఏవీ రెడ్డి అనే వ్యక్తులు కబ్జా చేశారని ఆ వ్యక్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను రాజేందర్ కు సమర్పించారు. వారు చేసిన ఫిర్యాదులో కీలకమైన విషయాలను వెల్లడించారు. ” ఓవర్ లాప్ భూ సర్వే నెంబర్లు ఆధారంగా చేసుకొని భూ బాగోతం నడిపించారు. ఆ భూమి విలువ 2000 కోట్ల వరకు ఉంటుంది.. కవిత భర్త పేరు మీద ఆ భూమి ఉంది. ఆ భూమిలో భారీ నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు ఆ ప్రాంతంలో కవిత భర్తకు భూమి లేదు. అసలు ఆయనకు ఆ స్థాయిలో ఆ భూమి ఎలా వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ బదిలీ జరిగింది. ఇందులో కవిత భర్త అనిల్ కుమార్, ఏవి రెడ్డి ప్రత్యక్షంగా ఉన్నారు. దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలి. ఆ భూమిలో పాఠశాల, ఆస్పత్రి వంటి వాటిని నిర్మించాలని” ఆ వ్యక్తులు రాజేందర్ ను కోరారు.
ఈ వ్యవహారంపై అనేక పర్యాయాలు హైడ్రాకు ఫిర్యాదు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని ఆ వ్యక్తులు చెబుతున్నారు. అయితే కవిత ప్రస్తుతం జాగృతి ఆధ్వర్యంలో యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వ్యక్తులు ఆరోపణలు చేయడం విశేషం. ఏకంగా వేలకోట్ల భూమి కబ్జా వ్యవహారంలో కల్వకుంట్ల కవిత భర్త పేరు వినిపించడం సంచలనం గా మారింది.
ఆక్రమణకు గురైన ఈ ప్రాంతం మొత్తం మల్కాజి గిరి పార్లమెంట్ పరిధిలో ఉండడం వల్లే ఆ వ్యక్తులు ఈటెల రాజేందర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫిర్యాదును స్వీకరించిన రాజేందర్ అనేక విషయాలను ఆ వ్యక్తుల ద్వారా తెలుసుకున్నట్టు సమాచారం. గులాబీ సోషల్ మీడియా ఈ విషయం పట్ల నిశ్శబ్దంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరిస్తోంది. కొన్ని సోషల్ మీడియా గ్రూపులు మాత్రం ఈ విషయానికి విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.